రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
దర్యాప్తులో సంచల విషయాలు?
తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పైడిరాజు, విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో మృతిచెందడంతో మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో ఇద్దరు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రాథమిక విచారణలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్కు తయారీ ప్రక్రియలో ఉపయోగించే ఆర్గన్ గ్యాస్‌తో పాటు ఇతర ప్రమాదకర వాయువుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
స్టీల్ మెల్టింగ్ షాప్ (SMS) యూనిట్‌లో ఆక్సిజన్ బ్లోయింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్గన్ గ్యాస్ లీక్ కావడం వల్ల రసాయనిక ప్రతిచర్య చోటుచేసుకుని భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావంతో లాడలే అనే ద్రవ ఉక్కు నిల్వ చేసే భారీ పాత్ర ఊడిపడటంతో, దాదాపు 150 టన్నుల ద్రవ ఉక్కు ఒక్కసారిగా బయటకు పొంగిపడింది.
దీంతో భారీ మంటలు చెలరేగి SMS యూనిట్‌లోని పలు భాగాలు దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం సంభవించిన సమయంలో యూనిట్‌లో ఉష్ణోగ్రతలు 1,560 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉన్నట్లు సమాచారం. మానవ తప్పిదం కంటే నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.
ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు పరిస్థితి, ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా (SAIL) నుంచి వచ్చిన సీనియర్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ రెండో రోజు కూడా ప్లాంట్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తోంది.
మరోవైపు కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. నాణ్యత లేని లేదా లోపభూయిష్టమైన మెటీరియల్ వినియోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై కూడా విచారణ జరుగుతోంది.
ఇక ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నానికి వెళ్లారు. బాధితులను కలిసిన అనంతరం ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశమై పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదానికి గల అసలు కారణాలపై త్రిసభ్య కమిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన ప్రత్యేక నివేదికలు రానున్న రోజుల్లో వెలువడనున్నాయి. ఈ నివేదికలు ప్రమాదానికి బాధ్యులెవరు, భద్రతా లోపాలు ఎక్కడ జరిగాయి, ఏ స్థాయిలో నిర్లక్ష్యం చోటుచేసుకుంది వంటి అంశాలపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.







