రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో సెంటిమెంట్ బలపడింది. పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, మెటల్, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల దన్నుతో సూచీలు రాణించాయి. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఓ దశలో 300 పాయింట్ల మేర రాణించగా.. నిఫ్టీ 24,100 ఎగువన ముగిసింది. గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 4.85 శాతం రాణించగా.. నిఫ్టీ 50 ఇండెక్స్ 4.35 శాతం లాభపడింది.
సెన్సెక్స్ ఉదయం 77,131.66 పాయింట్ల (క్రితం ముగింపు 77,155.62) వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,492.33 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 254.36 పాయింట్ల లాభంతో 77,409.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82.30 పాయింట్ల లాభంతో 24,168 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.34గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండిగో, ట్రెంట్, బీఈఎల్, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు రాణించాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4268 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.







