రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
ట్రిలియనీర్ దిశగా ఈలన్ మస్క్ ప్రయాణం
అపర కుబేరుడు ఈలన్ మస్క్ ఆధునిక చరిత్రలో ఏ మానవుడూ అందుకోలేని మైలురాయి వైపు దూసుకెళ్తున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఆస్తుల విలువలను లెక్కించి ర్యాంకింగులు ప్రకటించే ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ భారత కరెన్సీ ప్రకారం ఇప్పటికే రూ.75 లక్షల కోట్లకు పైగా ఉంది.
ఇప్పటివరకు ప్రైవేట్ లిమిటెడ్‌గా కొనసాగుతున్న మస్క్ సంస్థ SpaceX ఈ నెల 12న ఐపీవో ద్వారా షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇందులో మస్క్‌కు 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. ఈ ఐపీవో విజయవంతమైతే ఆయన ఆస్తుల నికర విలువ ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని, సుమారు 1.11 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. దీంతో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా మస్క్ చరిత్రలో నిలిచే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో ఇది కోటి కోట్ల రూపాయలకంటే ఎక్కువ. డాలర్ల లెక్క ప్రకారం ట్రిలియనీర్ అనే పదం ఉన్నా, రూపాయల లెక్కలో కోటి కోట్లకు ప్రత్యేక ఆంగ్ల పదం లేదు. అందుకే మల్టీ ట్రిలియనీర్ అనే పదమే వాడుతున్నారు. భారతీయ సంఖ్యా వ్యవస్థలో లక్ష కోట్లను మహాపద్మం, 10 లక్షల కోట్లను క్షోణి, 100 లక్షల కోట్లను మహాక్షోణి అంటారు. (రూ. 9,49,50,50,00,00,000) నేపథ్యంలో మస్క్‌ను సరదాగా మహాక్షోణాధిపతి అని పిలవొచ్చని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మస్క్ ఆస్తుల విలువ అనేక దేశాల వార్షిక జీడీపీ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, Oracle వ్యవస్థాపకుడు లారి ఎల్లిసన్ , గూగుల్ సహవ్యవస్థాపకులు లారి పేజీ , సెర్గెయి బ్రిన్ ల ఆస్తులన్నీ కలిపితేనే ట్రిలియన్ డాలర్ల మార్కు దాటుతుంది. అలాంటిది మస్క్ ఒక్కడి సంపదే వారికి సమీపంలో ఉండటం విశేషం. అమెరికాలోని హౌస్టన్ నగరంలో మస్క్ నివసిస్తున్నారు. న్యూ యార్క్ , లాస్ ఏంజెల్స్ తర్వాత అమెరికాలో మూడో అతిపెద్ద నగరంగా హౌస్టన్ నిలుస్తోంది. ఆ నగరంలోని మొత్తం నివాస, వాణిజ్య భవనాలన్నింటి విలువ కలిపినా మస్క్ ఆస్తుల విలువకంటే తక్కువగానే ఉంటుందని ఫోర్బ్స్ గణాంకాలు సూచిస్తున్నాయి.
గంటకు రూ. 9.5 కోట్లు ఖర్చు చేసినా వందేళ్లు సమయం..
ఫోర్బ్స్ వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన టాప్-50 స్పోర్ట్స్ టీముల మొత్తం విలువ 353 బిలియన్ డాలర్లు. మస్క్ కోరుకుంటే ఆ టీములన్నింటినీ ట్విట్టర్ ని కొన్నంత ఈజీగా కొనగలరని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.9.5 కోట్లు. గంటకు రూ.9.5 కోట్ల చొప్పున, రోజుకు 24 గంటలు, ఏడాదికి 365 రోజులు నిరంతరాయంగా ఖర్చు పెడుతూ పోయినా ట్రిలియన్ డాలర్లు పూర్తిగా ఖర్చు కావాలంటే 100 సంవత్సరాలకు పైగా పడుతుందని లెక్కలు చెబుతున్నాయి. అరుణాచలం సినిమాలోలాగే ఆ డబ్బు నుంచి ఎలాంటి ఆదాయం రాకుండా ఖర్చు పెడితేనే ఈ లెక్క సాధ్యమవుతుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.







