రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
ఎనర్జీ డ్రింక్స్‌పై తప్పుడు లేబుల్స్:
Red Bull, PepsiCo, Sting సహా ఆరు కంపెనీలకు FSSAI నోటీసులు
భారతదేశంలో విస్తృతంగా అమ్ముడవుతున్న ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లపై Food Safety and Standards Authority of India (FSSAI) చర్యలు ప్రారంభించింది. మార్కెట్లో అగ్రగామిగా ఉన్న రెడ్ బుల్ , పెప్సీ కో , క్యాంపా , స్టింగ్ , హెల్ ఎనర్జీ , కోకా కోల వంటి ఆరు పెద్ద కంపెనీలకు ఆహార భద్రతా సంస్థ అధికారిక నోటీసులు జారీ చేసింది.
ఈ కంపెనీలు తమ పానీయాలను ఎనర్జీ డ్రింక్స్‌గా పేర్కొంటూ, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు లేబుల్స్ ఉపయోగిస్తున్నాయని FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రాండింగ్, ప్రమోషన్లు, మార్కెటింగ్ విధానాల్లో ఈ సంస్థలు నిర్దేశిత ఆహార భద్రతా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించాయని పేర్కొంటూ, తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ నోటీసుల నేపథ్యంలో FSSAI కీలక సాంకేతిక అంశంపై స్పష్టతనిచ్చింది. తమ నిబంధనల ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ అనే ప్రత్యేక కేటగిరీకి సంబంధించి ఎలాంటి ప్రమాణాలను ఇప్పటివరకు నోటిఫై చేయలేదని, అయినప్పటికీ ఈ కంపెనీలు ఆ పదాన్ని లేబుల్స్‌పై స్వేచ్ఛగా వాడుతున్నాయని సంస్థ సూచించింది.
నిపుణుల వివరణ ప్రకారం, సాధారణంగా కెఫిన్, చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఇటువంటి పానీయాలను నాన్ ఆల్కహాలిక్ కార్బోనేటెడ్ బెవరేజెస్ కింద వర్గీకరించాల్సి ఉంటుంది. అయితే సంబంధిత కంపెనీలు తమ ఉత్పత్తులను హెల్త్, ఎనర్జీ సప్లిమెంట్స్‌లా ప్రచారం చేసుకుంటూ మార్కెట్లో విక్రయిస్తున్నాయని వారు చెబుతున్నారు.
ఆహార భద్రతా నిబంధనల అమలులో భాగంగా తీసుకున్న ఈ చట్టపరమైన చర్యల ద్వారా మార్కెట్లో విక్రయించే ఎనర్జీ డ్రింకుల నాణ్యతపై నియంత్రణ బలపడుతుందని, ఉత్పత్తులపై ఇవ్వబడే సమాచారంలో పారదర్శకత పెరుగుతుందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వినియోగదారుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఇలాంటి చర్యలు అత్యంత అవసరమని వారు భావిస్తున్నారు.
FSSAI జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఆయా కంపెనీల నుంచి వివరణలు అందిన తర్వాత, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఈ పరిణామం పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







