రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
హైదరాబాద్ నుంచి తిరుపతికి నడిచే విమాన సర్వీసులకు ఇటీవల డిమాండ్ నెలకొంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ శ్రీవాణి కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు ఈ టికెట్లు జారీచేస్తుంది. ఈ టికెట్లు పొందేందుకు ఉదయం వేళ తిరుపతికి చేరుకునేందుకు భక్తులు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాదు నుంచి తిరుపతికి రోజుకు దాదాపు 8 విమాన సర్వీసులు ఉన్నాయి. అయినా ఉదయం 7:20గంటలకు వచ్చే ఇండిగో ఎయిర్‌బస్, 8:30గంటలకు వచ్చే ఎయిరిండియా సర్వీసులకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీంతో మొదట పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు కేటాయిస్తూ వచ్చిన టీటీడీ ప్రయాణికుల తాకిడి ఎక్కువ కావడంతో రోజుకు 200 టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. శ్రీవాణి టికెట్ల కోసం వచ్చే ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ విమాన టికెట్ ధరలు సైతం అమాంతం పెరుగుతున్నాయి.
బుధవారం ధరలు ఇలా..
బుధవారం ఉదయం ఇండిగో విమాన టికెట్ ధర సుమారు రూ.15905, ఎయిర్‌ఇండియా టికెట్ ధర రూ.11905 వరకు నమోదైంది. మరోవైపు శ్రీవాణి టికెట్లు ప్రధానంగా ఈ రెండు విమానాల్లో వచ్చే ప్రయాణికులకే లభిస్తున్నాయనే కారణంగా వాటి టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. శ్రీవాణి టికెట్ల వల్లే ఈ సర్వీసుల ధరలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇంధన ధరలు తగ్గడం కూడా ఓ కారణం
ఇటీవల విమాన ఇంధన ధరలు పెరగడంతో ప్రయాణికుల రద్దీని బట్టి విమాన సంస్థలు సర్వీసులను కుదించుకున్నాయి. అదేసమయంలో మధ్యాహ్నం తర్వాత వచ్చే ప్రయాణికులకు శ్రీవాణి టికెట్లు లభించడం లేదు. ఫలితంగా విమాన సర్వీసులు తగ్గడంతో నడిచేవాటిలో ధరలు పెరుగుతున్నాయి. కాగా ప్రయాణికుల రద్దీ తగ్గిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాదు నుంచి తిరుపతికి రావాల్సిన 3, శివమొగ్గ నుంచి రావాల్సిన రెండు సర్వీసులను రద్దు చేసినట్టు సమాచారం.







