రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, ఆ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన వలసదారులను గుర్తిస్తూ ఫోర్బ్స్ ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత ప్రభావశీల వలసదారులుగా 250 మందిని ఎంపిక చేసిన ఈ జాబితాలో 27 మంది భారత సంతతి వ్యక్తులు ఉండటం విశేషంగా నిలిచింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం, విజ్ఞానం, సంప్రదాయాలు, ప్రజా జీవితం వంటి రంగాల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులను ఈ జాబితాలో చోటు కల్పించినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ఆధునిక అమెరికా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించిన వ్యాపారవేత్తల నుంచి మీడియా రంగ దిగ్గజాల వరకు పలువురు ఇందులో ఉన్నారు.
భారతీయ వలసదారుల విభాగంలో పెద్ద కంపెనీల అధిపతుల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వరకు పలువురు ప్రముఖులు ఎంపికయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, Micron సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, PepsiCo మాజీ అధిపతి ఇంద్రా నూయి, సైబర్ సెక్యూరిటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్త జయ్ చౌధరీ, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా, ఇన్వెస్టర్ నవల్ రవికాంత్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అభిజిత్ బెనర్జీ, టెలివిజన్ వ్యాఖ్యాత – రచయిత పద్మ లక్ష్మీ, వితరణశీలి నీర్జా సేథి వంటి భారత సంతతి ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. IBM సీఈఓ అరవింద్ కృష్ణ, Adobe సీఈఓగా పనిచేసిన శంతను నారాయణ్, సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ నికేశ్ అరోరా, కాన్ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నర్ఖెడే, ఇన్వెస్టర్ కవితార్క్ రామ్ శ్రీరామ్ పేర్లు కూడా జాబితాలో చోటు చేసుకున్నాయి.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విభాగంలో జ్యోతి బన్సల్, అమన్ నారంగ్, రాజ్ సర్దానా, జితేంద్ర మోహన్, స్వచ్ఛ ఇంధన రంగ దిగ్గజం కేఆర్ శ్రీధర్ వంటి భారతీయులు గుర్తింపు పొందారు. అమెరికా వ్యాపార, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో భారతీయ వలసదారుల పెరుగుతున్న ప్రభావాన్ని ఈ ఎంపిక ప్రతిబింబిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషించిన టాప్–5 వలసదారుల జాబితాలో కాలిఫోర్నియా మాజీ గవర్నర్, నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ (ఆస్ట్రియా), టెస్లా – స్పేస్ X అధిపతి ఎలాన్ మస్క్ (దక్షిణాఫ్రికా), గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ (రష్యా), న్విడై సీఈఓ జెన్సెన్ హువాంగ్ (తైవాన్), మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ (ఆస్ట్రేలియా) పేర్లు ఉన్నాయి.
వలస విధానాలపై అమెరికాలో రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్న సమయంలో, వలసదారుల కృషి, పాత్రను వెలుగులోకి తెచ్చేలా ఈ జాబితా విడుదల కావడం గమనార్హంగా మారింది.







