రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
మార్కెట్లపై ఐటీ దెబ్బ..
నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. గత ఐదు సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఆందోళనలు దేశీయ ఐటీ షేర్లను కుదిపేశాయి. దీంతో మార్కెట్లు పతనమయ్యాయి. చివర్లో కాస్త కొనుగోళ్లు జరిగినా.. సూచీల (Stock Market)కు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 24వేల మార్క్‌ను కష్టంగా నిలబెట్టుకుంది.
ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆరంభం నుంచే సూచీలు ఢీలా పడ్డాయి. 76,852.86 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ (Sensex) ఒక దశలో ఏకంగా 940 పాయింట్లు దిగజారి 76,649 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. సెషన్ చివర్లో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టం కొంత తగ్గింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 607.08 పాయింట్లు పతనమై 76,802.90 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) కూడా 26,373.20 - 24,047.20 మధ్య కదలాడింది. చివరకు 154.90 పాయింట్లు తగ్గి 24,013.10 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 94.33 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈ రంగంపై ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో ఐటీ కంపెనీల షేర్లు భారీగా కుదేలయ్యాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్ 6.75శాతం, టీసీఎస్ 3.55శాతం, టెక్ మహీంద్రా 2.63శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 2.59శాతం మేర కుంగాయి. ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, నెస్లే షేర్లు రాణించాయి. అమెరికా మార్కెట్లలో యాక్సెంచర్ షేర్లు గురువారం ఏకంగా 17శాతం మేర కుంగడం గమనార్హం.







