దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీక-

ఫార్చ్యూన్ ఇండియా గౌరవం

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీకి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె తొలి స్థానంలో నిలిచారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి వంటి విభిన్న రంగాల్లో ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించారు.

నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. సంస్థ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు స్పృశించాయి. వీరిలో దాదాపు 29 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో రిలయన్స్ ఫౌండేషన్ విస్తృత సేవలు అందిస్తోంది.

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానంలో నిలవడం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ గౌరవం ఆమె దార్శనిక నాయకత్వానికి, సమ్మిళిత వృద్ధి పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని సంస్థ పేర్కొంది. నిజమైన విజయాన్ని ఎలా కొలవాలన్న విషయంపై ఆమె అనుసరిస్తున్న భావజాలాన్ని కూడా సంస్థ ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఎంత సంపద సంపాదించామన్నది కాదు, ఎంతమంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చామన్నదే నిజమైన విజయానికి కొలమానం

ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో జరిగిన కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫ్యసిషన్స్ అఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) సంస్థ నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక AAPI హ్యూమానిటరియాన్ అవార్డు ను ప్రదానం చేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, భారతీయ సంస్కృతి పరిరక్షణ, సమాజాభివృద్ధి రంగాల్లో ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.

నీతా అంబానీ మానవతా సేవలకు గుర్తింపుగా టాంపా నగర మేయర్ జేన్ కాస్టర్ ఆమెకు ‘టాంపా నగర తాళం చెవి’ (Key to the City)ని అందజేశారు. అమెరికాలో అత్యున్నత పౌర సత్కారాల్లో ఒకటిగా పరిగణించే ఈ గౌరవాన్ని సాధారణంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన వ్యక్తులకు నగరం తరఫున కృతజ్ఞత సూచకంగా ప్రదానం చేస్తారు.

నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, క్రీడల ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి రంగాల్లో పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ సేవలకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమెకు వరుసగా గుర్తింపులు లభిస్తున్నాయి.