రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని (జీఎంఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ ఆగస్టులో సరికొత్త అవతారంలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. కొత్త పథకంలో ఆభరణ విక్రేతలు సైతం పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి గడిచిన రెండు వారాల్లో ఇద్దరు సీనియర్ మంత్రులు, ఆర్‌బీఐ అధికారులు, బ్యాంకులు, పసిడి పరిశ్రమకు చెందిన ప్రతినిధులు పలుమార్లు సమావేశమైనట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. ఈ సమావేశంలో బులియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.
ఈ పథకం ద్వారా కస్టమర్లు తమ బంగారాన్ని (నాణేలు, కడ్డీలు, రాళ్లు లేదా ఇతరాలు లేని ఆభరణాలు) బ్యాంక్‌ల వద్ద డిపాజిట్ చేయవచ్చు. కనీసం 10 గ్రాములు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు. డిపాజిట్ చేసిన బంగారాన్ని కరిగించి 99.5 శాతం స్వచ్ఛతతో కూడిన గోల్డ్ బిస్కెట్ల రూపంలోకి మారుస్తారు. ఈ స్కీమ్‌లో తొలుత మూడు కాలపరిమితుల (స్వల్ప, మఽధ్య, దీర్ఘకాలిక)తో కూడిన డిపాజిట్లను ప్రవేశపెట్టారు. మధ్యకాలిక (5-7 ఏళ్లు) డిపాజిట్‌పై 2.25 శాతం, దీర్ఘకాలిక (12-15 ఏళ్లు) డిపాజిట్‌పై శాతం వార్షిక వడ్డీ ప్రకటించారు. స్వల్పకాలిక (1-3 ఏళ్ల) డిపాజిట్‌పై వడ్డీని నిర్ణయించేందుకు సంబంధిత బ్యాంకుకే అధికారం కల్పించారు. కాలపరిమితి తీరాక కస్టమరు డిపాజిట్ చేసిన బంగారాన్ని లేదా దాని మార్కెట్ రేటుకు సమానమైన సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే, 2025 మార్చిలో ప్రభుత్వం మధ్య, దీర్ఘకాలిక డిపాజిట్ ఆప్షన్లను ఉపసంహరించుకుంది. కాగా, విధానపరమైన సమస్యలతో పాటు నమ్మకం లోపించిన కారణంగా కస్టమర్ల నుంచి ఈ పథకానికి ఆశించినంతగా స్పందన రాలేదు. గడిచిన 11 ఏళ్లలో ఈ స్కీమ్ కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే సమీకరించగలిగింది.







