రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడటం వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో సూచీలు ఒత్తిడికి లోనై క్రమంగా దిగజారుతున్నాయి.
ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 605 పాయింట్లు పతనమై 76,964 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 177 పాయింట్లు క్షీణించి 24,029 వద్ద ట్రేడవుతోంది. 24 వేల మార్క్ వద్ద నిఫ్టీ ఊగిసలాడుతూ కనిపిస్తోంది.
నిఫ్టీ సూచీలో కొన్ని బ్లూచిప్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా షేర్లు స్వల్ప లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో కూడా రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.72 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్ అనిశ్చితి, చమురు ధరల పెరుగుదల రూపాయి మీద ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మళ్లీ చమురు మంటలు.. పశ్చిమాసియా దద్దరిల్లుతోంది
పశ్చిమాసియాలో జియోపాలిటికల్ ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. హర్మూజ్ సముద్రప్రాంతంలో వాణిజ్య నౌకపై Islamic Revolutionary Guard Corps (IRGC) దాడి చేసిన ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ దాడిలో భారతీయ సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. దాడికి ప్రతిగా అమెరికా ఇరాన్‌పై తీవ్రంగా స్పందించగా, బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా బేస్‌లను టెహ్రాన్ మరోసారి టార్గెట్ చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేశాయి.
చమురు సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ ధర నాలుగు శాతం పెరిగి 79.26 డాలర్లకు చేరింది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల కరెన్సీలు, స్టాక్ మార్కెట్లు ఈ పరిణామాల ప్రభావాన్ని వెంటనే ప్రతిబింబిస్తున్నాయి.
దేశీయంగా చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత కలసి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పరిణామాలు, చమురు ధరల దిశ, గ్లోబల్ ఫండ్ ఫ్లోలపై ఆధారపడి సూచీల కదలిక ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







