మార్కెట్‌లోకి త్వరలో పాలిమర్‌ నోట్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. కొత్త తరహా కరెన్సీని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. 2027 నాటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నది ఆర్‌బీఐ ఆలోచనగా ఉందని ఎన్డీటీవీ ప్రాఫిట్‌ తన కథనంలో పేర్కొంది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత రూ.10, 20 విలువైన బ్యాంక్‌ నోట్లను ఆర్‌బీఐ వినియోగంలోకి తీసుకురానుంది. వీటిపై అభిప్రాయాలను సేకరించి పూర్తి స్థాయిలో 2027 నుంచి వినియోగంలోకి తీసుకురావాలన్నది ప్రణాళిక. పాలిమర్‌ నోట్లు వచ్చినప్పటికీ.. పేపర్‌ కరెన్సీ ఎప్పటిలానే కొనసాగుతుంది. దశలవారీగా పాలిమర్‌ నోట్లు మార్కెట్‌లోకి చలామణీకి రానున్నాయి.

పాలిమర్‌ కరెన్సీ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల వెల్లడించారు. ఈ కొత్త తరహా కరెన్సీ నోట్లను ముద్రించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన పదార్థమైన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్‌బీఐ నోట్ల ముద్రణా విభాగం గ్లోబల్‌ ఆసక్తి వ్యక్తీకరణను (EOI) జారీ చేసింది. ఆగస్టు 18 నాటికి బిడ్లు దాఖలు చేయాలని సూచించడం ఈ వాదనలనకు బలం చేకూర్చింది. నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం ఈ పాలిమర్‌ నోట్ల ముఖ్య ఉద్దేశం. ఇవి తడిని తట్టుకోగలవు. చిరిగి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఇప్పటికే పాలిమర్‌ నోట్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు.