రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో అనుబంధ బ్రాండ్ రియల్‌మీ, తన పీ4 సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రియల్‌మీ పీ4ఆర్ 5జీ (Realme P4R 5G) పేరుతో ఈ మోడల్‌ను విడుదల చేసింది. మిడ్‌రేంజ్ విభాగంలో ఫోన్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
రియల్‌మీ పీ4ఆర్ 5జీ ముఖ్య ఆకర్షణ 8000 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీ. దీన్ని 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో అందిస్తున్నారు. కంపెనీ సమాచారం ప్రకారం, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు ఫోన్‌ను వినియోగించుకోవచ్చని చెబుతోంది. అదనంగా 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఈ ఫోన్‌లో కల్పించారు.
డిస్‌ప్లే విషయానికి వస్తే, రియల్‌మీ పీ4ఆర్ 5జీలో 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. పనితీరులో భాగంగా డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించారు.
కెమెరా విభాగంలో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే రియల్‌మీ యూఐ 7పై ఈ ఫోన్ నడుస్తుంది.
అప్‌డేట్ల విషయానికొస్తే, రియల్‌మీ పీ4ఆర్ 5జీకి రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అదనంగా ఐపీ 65 రేటింగ్, ఏఐ పల్స్ లైట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.
ధరల పరంగా రియల్‌మీ పీ4ఆర్ 5జీ మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.20,999గా, 6జీబీ + 256జీబీ వేరియంట్ ధరను రూ.22,999గా కంపెనీ ప్రకటించింది. కార్డు ఆఫర్ ద్వారా రూ.2 వేల వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.
రంగుల విషయానికి వస్తే, ఈ ఫోన్ సిల్వర్ గ్లేర్, టైటానియం గ్లేర్, లావెండర్ గ్లేర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. రియల్‌మీ పీ4ఆర్ 5జీ విక్రయాలు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.







