రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: దేశీయ కార్ల మార్కెట్లో ఈ ఏడాది స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గడిచిన దశాబ్ద కాలంగా తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతూ వచ్చిన చిన్న కార్ల విభాగానికి మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్, తొలిసారి కారు కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి చిన్న కార్లకు డిమాండ్ గణనీయంగా పుంజుకుంటోంది.
మే నెలలో మారుతి సుజుకీకి చెందిన చిన్న కార్ల విక్రయాలు ఈ ధోరణిని స్పష్టంగా ప్రతిబింబించాయి. కంపెనీ చిన్న కారు Alto విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 90 శాతం పెరిగాయి. S-Presso అమ్మకాలు 254 శాతం, Celerio సేల్స్ 62 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అన్ని మోడళ్ల కార్ల సంఖ్య సుమారు 2 లక్షల యూనిట్లుగా ఉండగా, అందులో చిన్న కార్ల వాటా 30 వేల యూనిట్లకు పైగా ఉంది.
స్మాల్, హ్యాచ్‌బ్యాక్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న మోడళ్లను పునరుద్ధరించడంలో మారుతి సుజుకీ, టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ (TMPV) ముందంజలో ఉన్నాయి. మిగతా కంపెనీలు కూడా ఈ విభాగంపై మళ్లీ దృష్టి సారిస్తున్నాయి.
చిన్న కార్లకు మళ్లీ గిరాకీ పెరగడానికి పలు అంశాలు కారణమయ్యాయి. ప్రీమియమైజేషన్ ధోరణితో పాటు కార్ల ధరలు ఏటేటా పెరుగుతుండటంతో SUV మోడళ్లు మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయాయి. చిన్న కార్లతో పోలిస్తే SUVల ధరలు, నిర్వహణ ఖర్చులు రెండూ ఎక్కువగా ఉండటం కూడా ప్రభావం చూపింది. ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల వాహనానికి అప్‌గ్రేడ్ కావాలనుకునే మధ్యతరగతి కస్టమర్లు చిన్న కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుబాటు ధర, అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు చిన్న కార్లకు ప్లస్ పాయింట్లుగా మారాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై GSTని గణనీయంగా తగ్గించడం కూడా డిమాండ్, బుకింగ్స్ పెరుగుదలకు దోహదపడింది. గత సంవత్సరం సెప్టెంబరులో GST తగ్గింపుతో కార్ల విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతల మధ్య కూడా కార్ల కంపెనీలు బంపర్ విక్రయాలను నమోదు చేయగలుగుతున్నాయి.
అయితే భవిష్యత్‌లోనూ ఈ విక్రయాల జోరును కొనసాగించాలంటే, గడిచిన కొన్నేళ్లుగా విస్మరించిన మధ్యతరగతి కస్టమర్లను తిరిగి ఆకర్షించడం తప్పనిసరి అని కార్ల కంపెనీలు గుర్తించాయి. అందుకే స్మాల్, హ్యాచ్‌బ్యాక్ మోడళ్లపై మళ్లీ ఫోకస్ పెంచుతున్నాయి.
ఇక మరోవైపు అధిక మార్జిన్ల ఆశతో పాటు యువ కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ల కంపెనీలు గడిచిన కొన్నేళ్లుగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV), మల్టీ పర్పస్ వెహికల్ (MPV) మోడళ్లను అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. ఆధునిక హంగులు, అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ మోడళ్ల ముందు చిన్న కార్లు వెనుకబడిపోయాయి. కస్టమర్ల అభిరుచులు, ప్రాధాన్యాలు మారడంతో SUVల విక్రయాలు వేగంగా పెరిగాయి. ఫలితంగా స్మాల్, హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలు క్షీణించాయి.
2018-19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కార్ల మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ విక్రయాల వాటా 46 శాతంగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరం నాటికి అది 23 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో SUVల విక్రయాల వాటా గడిచిన దశాబ్ద కాలంలో వేగంగా పెరిగి ప్రస్తుతం 55 శాతానికి చేరుకుంది. SUVలు, MPVల కలిపి మొత్తం వాటా 68 శాతంగా నమోదైంది.
మున్ముందు కూడా SUVల ఆధిపత్యం కొనసాగుతుందని, చిన్న, హ్యాచ్‌బ్యాక్ కార్లకు మళ్లీ గిరాకీ పెరుగుతున్నప్పటికీ ఈ విభాగం పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడం కష్టమేనని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







