రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్‌లో ఊగిసలాడాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితులు, చమురు ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఘర్షణలు ప్రాంతీయ యుద్ధానికి దారితీయొచ్చనే భయాలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడింది. ఈ క్రమంలోనే దేశీయ సూచీలు ప్లాట్‌గా ముగిశాయి.
చివరికి సెన్సెక్స్ 1.44 పాయింట్ల లాభంతో 77,186.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.75 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్‌టెక్, ఇండిగో, బజాజ్‌ఫైనాన్స్, మారుతీ,మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ కంపెనీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎటర్నల్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్, ఎన్‌టీపీసీ, ట్రెంట్ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96.34 వద్ద ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర 84.76 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,033 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఆసియా మార్కెట్లలో దక్షిణకొరియా కోస్పి, జపాన్ నిక్కీ వంటి మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి.







