రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభయ్యాయి. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో చమురు మంటలు భగ్గుమంటున్నాయి. దాంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది.
హర్మూజ్‌ను దిగ్బంధిస్తున్నాం.. టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మరోసారి చమురు ధరలు భారీగా పెరిగాయి. నెలరోజుల గరిష్ఠానికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక బ్యారెల్‌కు రెండు శాతం పెరిగి 85 డాలర్లకు చేరింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ రెండు శాతం పెరిగి 80 డాలర్లకు పెరిగింది. గత సెషన్‌లో 9.6 శాతం పెరిగింది. 2020 మే తర్వాత ఒకేరోజు ఈ స్థాయి పెరుగుదల నమోదైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్ 412 పాయింట్లు పడిపోయి, 77,203 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 107 పాయింట్లు నష్టపోయి, 24,103 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 42 పైసలు పడిపోయి, 96.10కి కుంగింది. నిఫ్టీ సూచీలో హిందాల్కో, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉండగా.. శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోతున్నాయి. ఇక, సోమవారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. ఆసియా మార్కెట్లు అదే బాటలో ఉన్నాయి.







