రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో సూచీలు అమాంతం పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2 శాతానికి పైగా కుంగాయి. ఈ అనూహ్య పరిణామాలతో దాదాపు రూ.8లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ (Sensex) 1600 పాయింట్లకు పైగా దిగజారగా.. నిఫ్టీ (Nifty) 24వేల మార్క్‌ను కోల్పోయింది.
30 నిమిషాల్లోనే 1000 పాయింట్లు తగ్గి..
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఈ ఉదయం సూచీలు (Stock Market) నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. క్రితం ముగింపు (78,180)తో పోలిస్తే దాదాపు 400 పాయింట్ల నష్టంతో 77,816 వద్ద సెన్సెక్స్ నేడు ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులతోనే సాగిన సూచీ.. ఆ తర్వాత కుప్పకూలింది. ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్ల బ్లడ్‌బాత్‌కు దారితీసింది. కేవలం 30 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు తగ్గింది. ఒక దశలో 1800 పాయింట్లకు పైగా పతనమైన సూచీ.. మార్కెట్ ముగిసే సమయానికి 1677.12 పాయింట్లు క్షీణించి 76,503.60 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 516.65 పాయింట్ల నష్టంతో 23,882.05 వద్ద ముగిసింది.
దాదాపు అన్ని రంగాల సూచీలు నేడు నష్టపోయాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకీ, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు భారీగా పడిపోయాయి. ఓఎన్జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో స్వల్పంగా లాభపడ్డాయి. జియో ఫైనాన్షియల్ షేరు 12 శాతం మేర కుంగింది.పతనానికి కారణాలివే..
అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం ట్రంప్ స్పందిస్తూ.. టెహ్రాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ప్రకటించారు. ఆ దేశంలో చర్చలు జరపడం కూడా సమయం వృథా అని పేర్కొన్నారు. దీంతో మళ్లీ యుద్ధభయాలు నెలకొన్నాయి.
ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6శాతం పెరిగి 78.56 డాలర్లకు చేరింది.
రూపాయి విలువ మరింత క్షీణించింది. నేటి ట్రేడింగ్‌లో మరో 63 పైసలు తగ్గి 95.59 వద్ద స్థిరపడింది.
వాల్‌స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. నాస్‌డాక్ 1.5శాతం, డోజోన్స్ ఫ్యూచర్స్ 1.2శాతం, ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్ 1 శాతం మేర కుంగాయి.







