రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూర్: పేద ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించి, అందత్వాన్ని నివారించాలనే లక్ష్యంతో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు విశేషంగా స్పందించారు. ఉదయం నుంచి శిబిరానికి రోగులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు.
శిబిరంలో మొత్తం 210 మంది రోగులు కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 99 మంది కంటి శస్త్రచికిత్సకు ఎంపికయ్యారు. శిబిరానికి హాజరైన రోగులకు ఎస్వీ అరవింద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించింది. వివిధ కంటి సమస్యలతో వచ్చిన రోగులను వైద్యులు పరిశీలించి, అవసరమైన వారికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు.
గత నెల ఇదే శిబిరం ద్వారా కంటి శస్త్రచికిత్స చేయించుకున్న 67 మందికి ఈ సందర్భంగా రివ్యూ పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సమీక్షించి, శస్త్రచికిత్స అనంతరం కంటి చూపు, ఆరోగ్య పురోగతిని పరిశీలించారు. శస్త్రచికిత్స అనంతర సంరక్షణ, మందుల వినియోగం, కంటి సంరక్షణపై వారికి సూచనలు అందించారు.
జైన్ సంఘ్ ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ, సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల నాలుగో ఆదివారం చిత్తూరు నగరంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరాల ద్వారా పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు కంటి వైద్య సేవలు అందుతున్నాయని ఆయన వివరించారు.
కంటి శస్త్రచికిత్సకు ఎంపికైన రోగులకు ఆపరేషన్ ఖర్చులు, లెన్స్ చార్జీలు, రాకపోకల బస్సు సౌకర్యం, భోజనం, వసతి వంటి అన్ని సదుపాయాలను జైన్ సంఘ్ ఉచితంగా కల్పిస్తున్నట్లు సుభాష్ జైన్ తెలిపారు. ఈ సేవల వల్ల పేద ప్రజలు ఆర్థిక భారంలేకుండా కంటి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
జైన్ సంఘ్, ఎస్వీ అరవింద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరాలు చిత్తూరు పరిసర ప్రాంతాల పేద ప్రజలకు ఆశాకిరణంగా మారుతున్నాయి. కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్న అనేక మంది ఈ శిబిరాల ద్వారా తిరిగి చూపు పొందుతున్నారని నిర్వాహకులు తెలిపారు.













