రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూర్ జిల్లా:- చిత్తూరు ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవేంద్ర (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన పుంగనూరు-పలమనేరు జాతీయ రహదారి టోల్‌ప్లాజా సమీపంలోని కనుమలో గంగమ్మ గుడి వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనపై స్థానికంగా విషాదం నెలకొంది.
సీఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లెలో కొనుగోలు చేసిన ఇంటి నివాస స్థలంపై వివాదం తలెత్తడంతో దేవేంద్ర సోమవారం మదనపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆలస్యంగా మదనపల్లె నుంచి చిత్తూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పుంగనూరు సమీపంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దేవేంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై దేవేంద్ర భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. రామిరెడ్డిగారిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌ల వద్ద 2023లో తన భర్త దేవేంద్ర కొంత భూమిని కొనుగోలు చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అయితే అదే భూమిని 2014, 2020 సంవత్సరాల్లో వారు ఇతరులకు విక్రయించి డబ్బు తీసుకున్నారని, తమకు భూమిని చూపకపోవడంతో పాటు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని లావణ్య పోలీసులకు వివరించినట్లు సమాచారం.
భూమి కొనుగోలు వివాదంపై దేవేంద్ర సోమవారం మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి వస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగినట్లు లావణ్య పేర్కొన్నారు. ఫిర్యాదు చేసి చిత్తూరుకు బయలుదేరుతున్నట్లు దేవేంద్ర తన చరవాణి ద్వారా ఆమెకు తెలిపిన కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
దేవేంద్ర మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, భూమి కొనుగోలు వ్యవహారంలో తన భర్తకు న్యాయం జరిగేలా చూడాలని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.













