రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడు సంవత్సరాల విరామం తీసుకున్న అఖిల్ అక్కినేని, తాజా చిత్రంగా ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. నాగార్జునతో కలిసి ‘సితార’ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. జూలై 10న ‘లెనిన్’ విడుదల కానుంది.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టాయి. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. మూడు నిమిషాలు 9 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. ‘ఇది మహాభారతం’ అంటూ నాగార్జున, ‘లెనిన్’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాడు.
చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు ద్రౌపది అమ్మవారిని కొలుస్తారని, ఆ 18 రోజులు భూమిపై రక్తం చిందించకుండా నిష్టగా జాతర నిర్వహిస్తారని ట్రైలర్‌లో వివరించారు. ఆ నేపథ్యంతోనే జాతరలో హీరో అఖిల్ తలపై గాయం అవుతుండగా, ఆ రక్తం హీరోయిన్ నుదుటిపై బొట్టుగా మారే విజువల్ ఆకట్టుకునేలా మలిచారు.
తర్వాత హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ కథను చూపించారు. అనంతరం ధర్మరాజు పాత్రలో వసంత్ కనిపిస్తాడు. అతను హీరో స్నేహితుడిగా, కథను ముందుకు తీసుకెళ్లే కీలక పాత్రగా ట్రైలర్‌లో సూచించారు. తరువాత వసంత్‌కు విలన్ వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని హీరో ఎలా పరిష్కరించాడు, ‘కురుక్షేత్రం’లో చివరి ఘట్టం అంటూ హీరో విశ్వరూపాన్ని ఎలా చూపించారు అన్నది మిగిలిన కథగా ట్రైలర్ హింట్ ఇస్తుంది.
ట్రైలర్ మొత్తం కథపైనే స్పష్టమైన సూచనలు ఇచ్చేలా కట్ చేశారు. అనవసరమైన ఎలివేషన్ల జోలికి వెళ్లకుండా, దాదాపు అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు బలం చేకూర్చింది. చివరి షాట్‌లో అఖిల్ చెప్పే డైలాగ్, అతని మేనరిజమ్స్ పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. అలాగే అఖిల్ లుక్‌ను మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.
మొత్తానికి ‘లెనిన్’ ట్రైలర్ విజువల్స్, నేపథ్యం, సంగీతం, పాత్రల పరిచయం పరంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. మహాభారతం నేపథ్యంతో, చిత్తూరు జాతర వాతావరణంలో సాగే ఈ కథను పెద్ద తెరపై ఎలా మలిచారన్నది జూలై 10న విడుదలయ్యే చిత్రంతో తెలిసి రానుంది.













