న్యూ ఛండీగఢ్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఉత్కంఠగా సాగింది. తొలి రోజు ఆఫ్ఘన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన భారత బ్యాటర్లు, రెండో రోజు మాత్రం ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లకు తలొగ్గాల్సి వచ్చింది. కీలక సమయాల్లో వికెట్లు తీసిన ఆఫ్ఘన్ పేసర్ సలీమ్ సఫీ భారత ఇనింగ్స్‌ను కట్టడి చేశాడు. భారత్ తొలి ఇనింగ్స్‌ను 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

శనివారం శతకంతో రాణించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో రోజు కూడా దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్ వైపు దూసుకెళ్తున్న సమయంలో సలీమ్ సఫీ దెబ్బతీశాడు. గిల్ 126 పరుగుల వద్ద సఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతని వికెట్‌తో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు మ్యాచ్‌లోకి తిరిగి వచ్చారు.

గిల్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సలీమ్ సఫీ బౌలింగ్‌కే డక్‌గా పెవిలియన్ చేరాడు. శనివారం అర్ధశతకంతో ఆకట్టుకున్న రిషభ్ పంత్ రెండో రోజు సెంచరీ దిశగా సాగుతుండగా 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో భారత్ మధ్య వరుసలో ఒత్తిడిని ఎదుర్కొంది.

డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న మానవ్ సుతార్ 28 పరుగులకే పరిమితమయ్యాడు. అతనిని కూడా సలీమ్ సఫీనే ఔటు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ మాత్రం ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. కేవలం 12 బంతుల్లో 22 పరుగులు బాదిన సిరాజ్, సలీమ్ సఫీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఇక మరో ఎండ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్ మాత్రం ఒకవైపు వికెట్లు పడుతున్నా స్థిరంగా నిలిచి బ్యాటింగ్ కొనసాగించాడు. తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న తర్వాత భారత ఇనింగ్స్‌ను కెప్టెన్ గిల్ డిక్లేర్ చేశాడు. దీంతో భారత్ భారీ స్కోర్‌ను స్కోర్‌బోర్డుపై నమోదు చేసింది.

ఈ ఇనింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో సలీమ్ సఫీ ఒక్కడే ఆరు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ లైనప్‌ను గట్టిగా కుదిపేశాడు. మిగతా బౌలర్లలో జియావుర్ రెహమాన్, హష్మతుల్లా షాహిదీకి తలో వికెట్ దక్కింది.

ఇదివరకు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 139 పరుగులు జోడించింది. 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సాయి సుదర్శన్ ఔటవగా, కేఎల్ రాహుల్ మాత్రం క్లాస్ బ్యాటింగ్‌తో తన టెస్ట్ కెరీర్‌లో 12వ శతకాన్ని నమోదు చేశాడు.

భారీ లక్ష్యాన్ని ఎదుర్కొనే ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇప్పుడు తొలి ఇనింగ్స్‌లో ఎలా ప్రతిస్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ముగిసే సమయానికి ఆఫ్ఘన్ బ్యాటింగ్ ప్రారంభమైందితో, మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.