రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ క్రికెటర్ హష్మతుల్లా షాహిదీ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఆటగాడిగా వన్డే జట్టుకు కొనసాగుతానని స్పష్టం చేశారు.
తన రాజీనామా నిర్ణయాన్ని షాహిదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అఫ్గానిస్థాన్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా సేవలందించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
పూర్తి గౌరవం, సమ్మతితో అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. జట్టు కెప్టెన్‌గా సేవలందించడం నాకు గొప్ప గౌరవం. నిజాయితీ, ఐక్యత, అంకితభావంతో ఈ బాధ్యతను నిర్వర్తించినందుకు గర్వంగా ఉంది.
31 ఏళ్ల హష్మతుల్లా షాహిదీ 2022 ప్రారంభంలో అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో అఫ్గానిస్థాన్ జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ తో పాటు 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ పాల్గొంది.
2023 వరల్డ్ కప్ లో భారత్‌పై జరిగిన లీగ్ మ్యాచ్‌లో షాహిదీ కీలక ఇన్నింగ్స్ ఆడారు. 88 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు 272 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని టీం ఇండియా ఆ లక్ష్యాన్ని సులభంగా ఛేదించి విజయం సాధించింది.
అయినా ఆ టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ , పాకిస్తాన్ , శ్రీ లంక , నెథర్లాండ్స్ వంటి బలమైన జట్లపై అఫ్గానిస్థాన్ సంచలన విజయాలు నమోదు చేసింది. ఈ విజయాలతో సెమీఫైనల్‌కు చేరువ వరకు వెళ్లి ప్రపంచ క్రికెట్లో విశేష గుర్తింపు పొందింది.
షాహిదీ రాజీనామా నేపథ్యంలో అఫ్గానిస్థాన్ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. వచ్చే నెల ఐర్లాండ్ తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు ముందు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త వన్డే కెప్టెన్ పేరును ప్రకటించనుంది. ఈ నిర్ణయం ద్వారా జట్టులో నాయకత్వ మార్పు ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.






