రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం జూలై 23న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయిన టీమిండియా, జింబాబ్వేపై విజయాలతో తిరిగి పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఈ సిరీస్‌లో పలు మార్పులతో ఆడనుంది. సీనియర్ ఆటగాళ్లు సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడంతో యువ క్రికెటర్లకు అవకాశాలు దక్కనున్నాయి. తొలి టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండవచ్చన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ తొలి మూడు టీ20ల్లో రాణించలేకపోయాడు. వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి మొత్తం 42 పరుగులకే పరిమితమవడంతో చివరి టీ20లో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే జింబాబ్వే సిరీస్‌కు సంజు శాంసన్ ఎంపిక కాకపోవడంతో వైభవ్‌కు మరోసారి అవకాశం లభించే అవకాశం ఉంది.
ప్రపంచ నంబర్-2 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. జింబాబ్వే పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈసారి తన సహజ దూకుడు ఆటను ప్రదర్శించాలని వైభవ్ లక్ష్యంగా పెట్టుకున్నాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. అభిషేక్ శర్మకు జింబాబ్వే గడ్డపై మంచి రికార్డు ఉంది. ఇదే వేదికపై టీ20ల్లో అరంగేట్రం చేయడంతో పాటు తన తొలి అంతర్జాతీయ సెంచరీని కూడా నమోదు చేశాడు. దీంతో ఓపెనర్లపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మూడో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్‌కు రానుండగా, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ శ్రేయస్ అయినప్పటికీ, జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. జింబాబ్వే పర్యటనలో మాత్రం ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది.
ఫినిషర్‌గా రింకూ సింగ్ మళ్లీ తుది జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమవ్వడంతో శివమ్ దూబే ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి అతని స్థానంలో యువ పేసర్ అశోక్ శర్మను కూడా పరీక్షించే అవకాశం జట్టు నిర్వహకులు పరిశీలిస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు కనిపించనున్నాయి. స్పిన్ విభాగానికి రవి బిష్ణోయ్ నాయకత్వం వహించనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా హర్ష్ దూబేకు అవకాశం దక్కే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో లేకపోవడంతో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లు కొత్త బంతిని అందుకోనున్నారని జట్టు వర్గాలు సూచిస్తున్నాయి.
యువ పేసర్ అశోక్ శర్మకు అవకాశం ఇవ్వాలనుకుంటే, ఇటీవల ఫామ్‌లో తేలిపోతున్న శివమ్ దూబే స్థానంలో అతన్ని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తుది జట్టులో ఎవరికీ అవకాశం దక్కుతుందన్నది మ్యాచ్‌కు ముందు ప్రకటించే అధికారిక జట్టుతోనే స్పష్టంకానుంది.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే/అశోక్ శర్మ, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్/ వరుణ్ చక్రవర్తి , ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.






