రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: మేజర్ లీగ్ క్రికెట్ 2026 సీజన్లో భాగంగా జరిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్, ఎంఐ న్యూయార్క్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తీవ్ర ఆగ్రహానికి గురై, ప్రత్యర్థి బౌలర్‌పై బ్యాట్ ఎత్తిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 245/5 భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఎంఐ న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్ చివరి బంతి వద్ద వివాదాస్పద సంఘటన జరిగింది. పాకిస్థాన్ సంతతికి చెందిన యూఎస్ఏ పేసర్ ఆసిఫ్ మహమూద్ ఆ ఓవర్‌ను విసిరాడు.
ఆ ఓవర్ చివరి బంతిని కీరన్ పొలార్డ్ ఆడినప్పటికీ, బంతి సరిగా కనెక్ట్ కాలేదు. ఫలితంగా బంతి నేరుగా బౌలర్ ఆసిఫ్ మహమూద్ చేతుల్లోకి వెళ్లింది. ఈ సమయంలో బౌలర్ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్లను లక్ష్యంగా చేసుకుని త్రో వేయడానికి సిద్ధమయ్యాడు.
షాట్ కొట్టి ఫాలో త్రూలో కాస్త ముందుకు వచ్చిన పొలార్డ్, మొదట క్రీజులోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే బౌలర్ త్రో చేయబోతున్న సమయంలో పొలార్డ్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. క్రీజులో బ్యాట్ పెట్టకుండా, బౌలర్ వైపు బ్యాట్‌ను ఎత్తి చూపించాడు. బౌలర్ త్రో చేస్తే, బ్యాట్‌తో కొట్టేలా తన హావభావాలు కనిపించాయి. దీంతో ఆసిఫ్ మహమూద్ చివరికి త్రో చేయకుండా వెనక్కి తగ్గాడు.
గ్రౌండ్లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. పొలార్డ్ ప్రవర్తనపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు ఇది ఆటలో భాగమేనని అభిప్రాయపడుతున్నారు.
బ్యాట్‌తో బెదిరించిన ఈ ఘటన జరిగినప్పటికీ, అదే మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. అతడు 56 బంతుల్లో సెంచరీ బాదుతూ అజేయంగా నిలిచాడు. అయినప్పటికీ అతని జట్టు ఎంఐ న్యూయార్క్ 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
పోలార్డ్, ఆసిఫ్ మహమూద్ మధ్య జరిగిన ఈ ఘర్షణాత్మక సన్నివేశం చూసిన నెటిజన్లు పాత ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన పొలార్డ్, రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు పేసర్ మిట్చెల్ స్టార్క్ మధ్య కూడా ఇలాంటి వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లోనూ పొలార్డ్ తన ఆగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇప్పటి ఘటనను ఆ సంఘటనతో పోలుస్తూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. పొలార్డ్ అప్పట్లో ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే ఉన్నాడని, అతని ఆగ్రహ స్వభావం మారలేదని కామెంట్లు చేస్తున్నారు.







