విజయవాడ: నెల రోజులుగా ఆచూకీ లేని గాదె సాయికృష్ణ కేసు విచారణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా విచారణాధిక న్యాయస్థానం విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాయికృష్ణను ఈ నెల 29లోగా హైకోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ గడువులోగా బాధితుడిని కోర్టులో ప్రవేశపెట్టకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు కోర్టు సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..: నెల రోజుల క్రితం మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, తన కుమారుడి గల్లంతు, పోలీసుల ప్రవర్తనపై మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు తనను బెదిరించారని, తన కుమారుడి ప్రాణహానికి గురయ్యేలా మాట్లాడారని ఆమె ఆరోపించారు.

విజయలక్ష్మి ప్రకారం, గత నెల 9వ తేదీ రాత్రి మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. ఆ తరువాత నుంచి అతడి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని ఆమె తెలిపారు. తరువాత సీఐ నాగరాజు పిలుపుతో తానూ మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకురావడమేగాక, తన సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

తన కుమారుడి ఆచూకీ కోసం పలుమార్లు పోలీసులను సంప్రదించినప్పటికీ, ఎటువంటి సమాధానం ఇవ్వలేదని విజయలక్ష్మి పేర్కొన్నారు. సాయికృష్ణను తీసుకువచ్చి 20 రోజులు దాటిపోయినా, ఇప్పటికీ కోర్టులో హాజరుపరచకపోవడం వల్ల అతడిని చంపేసి ఉండొచ్చనే అనుమానం కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయలక్ష్మి, న్యాయవాదులతో కలిసి విజయవాడలోని బెజవాడ బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తన కుమారుడు బతికే ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చనిపోయి ఉంటే శవాన్ని అప్పగించాలని కోరుతూ ఆమె అక్కడ ఆందోళన చేపట్టారు.

తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని, అతడిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని కోరుతూ విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని సీఐ నాగరాజును ఆదేశిస్తూ, గడువు లోపల ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.