రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ సెర్చ్ ఆపరేషన్..
గంజాయి, టాబ్లెట్ల స్వాధీనం
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పరిసరాల్లో నేరాల నియంత్రణ, మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషనే చేపట్టారు. అడిషనల్ జాయింట్ సీపీ తప్సీర్ ఇక్బాల్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఈ సోదాలు సాగాయి. ఈ భారీ ఆపరేషన్ కోసం 38 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. దాదాపు 1,100 మంది పోలీసు సిబ్బంది ఒక్కసారిగా మంగర్ బస్తీని చుట్టుముట్టి, ప్రతి ఇంటినీ కూలంకషంగా తనిఖీ చేశారు. బస్తీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి వారు లోపలికి రాకుండా రహదారులను దిగ్బంధించారు.
యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ, ఇళ్లల్లో రహస్యంగా దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో గంజాయి, అక్రమ మద్యం నిల్వలతో పాటు, మత్తు కోసం ఉపయోగించే నిషిద్ధ నైట్రావెట్ టాబ్లెట్లు, అక్రమ దగ్గు సిరప్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల సీజ్‌తో పాటు, బస్తీలో ఆశ్రయం పొందుతున్న పాత నేరస్థులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. దీర్ఘకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న పలువురు నిందితులను ఈ సోదాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని పలు అనుమానాస్పద వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.







