పీలేరు వద్ద.. ముగ్గురు

మాచర్ల నగరవనం వద్ద.. నలుగురు

అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో కారు, ఆటో డీకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పీలేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీర్ల పండగ ముగించుకుని ఆటోలో వస్తున్న కుటుంబంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముబారక్, మెహరున్ బీ, వాహిద్ అక్కడికక్కడే మరణించారు.

మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి..

ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని వారికి సూచించారు. ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు వాహనంలోనే ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు శారద, సత్యనారాయణగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్‌ సహా 13 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బంధువు మృతి చెందడంతో వాహనంలో పామూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.