రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి, ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. విధుల్లో అశ్రద్ధ, అజాగ్రత్తకు ఏమాత్రం తావివ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం ఎస్‌బీఐ ఎంప్లాయీస్‌ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో రిటర్నింగ్‌ అధికారులు, మున్సిపల్‌ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ యంత్రాంగం బాధ్యతలు, అనుసరించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలపై వివరణాత్మకంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా కమిషనర్‌ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల పునర్విభజన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మరమ్మతులు, రిజర్వేషన్లు, కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు తదితర ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 68 వార్డులు ఉండగా, 4,79,861 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.

వీరిలో 2,32,508 మంది పురుషులు, 2,47,295 మంది మహిళలు, 58 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారని కమిషనర్‌ తెలిపారు. ప్రతి నాలుగు వార్డులకు ఒక రిటర్నింగ్‌ అధికారిని నియమించి, వారికి ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మేయర్‌, కార్పొరేటర్‌ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియను చిత్రీకరించేందుకు వీడియో గ్రాఫర్లను నియమిస్తున్నట్లు, అవసరమైన ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసినట్లు చల్లా ఓబులేసు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు తమ లాగిన్‌ల ద్వారా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతిరోజూ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌లను పూర్తిగా చదివి, నిబంధనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను ఓటర్లు ఒకే బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. పోలింగ్‌ అనంతరం ప్రత్యేక బందోబస్తు మధ్య బ్యాలెట్‌ బాక్సులను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. మేయర్‌ అభ్యర్థి గరిష్ఠంగా రూ.25 లక్షలు, కార్పొరేటర్‌ అభ్యర్థి రూ.10 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయవచ్చని స్పష్టం చేశారు.