చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లను జిల్లా అధికారులు, దేవస్థానం యంత్రాంగం సంయుక్తంగా పరిశీలించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో భద్రతా ఏర్పాట్లు, భక్తుల కోసం క్యూలైన్లు, గ్రామంలో మాడా విధులు, ఇతర మౌలిక సదుపాయాలపై సమీక్ష జరిగింది.

బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఆలయ పరిసరాలు, కాణిపాకం గ్రామం మొత్తం మీద విస్తృత పర్యటన నిర్వహించారు. క్యూలైన్ల ఏర్పాటు, భక్తుల రాకపోకలకు అనుకూలంగా మార్గాల సర్దుబాటు, బస్టాండు వద్ద అవసరమైన సదుపాయాల కల్పన వంటి అంశాలను అధికారులు పరిశీలించారు.

ఎలక్ట్రికల్ వ్యవస్థల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న షాపులు, తాత్కాలిక స్టాళ్ల యజమానులు, సేవా సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యుత్ లైన్లు, జనరేటర్లు, తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు వంటి వాటిని సురక్షితంగా నిర్వహించాలనే అంశాన్ని సంబంధిత శాఖల అధికారులు సూచించారు.

కాణిపాకం గ్రామంలో మాడా విధుల అమలు పరిస్థితిని కూడా అధికారులు పరిశీలించారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరాల ఏర్పాటు వంటి అంశాలపై సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై కూడా చర్చించారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, చిత్తూరు అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి, సిఐ శ్రీధర్ నాయుడు, ఐరాల ఎమ్మార్వో, ఆర్&బి, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, మండల అధికారులు, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, ఇంజనీరింగ్ శాఖ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.