రాయలసీమ న్యూస్, కర్నూలు:
కర్నూలు మున్సిపల్ ఎన్నికలు: అథేనా స్కూల్లో కౌంటింగ్ కేంద్రానికి ముమ్మర ఏర్పాట్లు
కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగర శివార్లలోని ది అథేనా స్కూల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కమిషనర్ చల్లా ఓబులేసు, డీఎస్పీ కె.వి. రాఘవేంద్ర, మున్సిపల్ అధికారులతో కలిసి ది అథేనా స్కూల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, రాకపోకలకు అవసరమైన రహదారులు, మెటర్ రోడ్డు, జంగిల్ క్లియరెన్స్ వంటి అంశాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా అవసరమైన పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ అధికారులు, సిబ్బందికి సూచించారు. పార్కింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రత, రాకపోకల నిర్వహణ, బారికేడ్ల ఏర్పాట్లపై డీఎస్పీ కె.వి. రాఘవేంద్రతో కమిషనర్ చర్చించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కమిషనర్ సూచించారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, రహదారి సదుపాయాలు, పార్కింగ్ వంటి అన్ని అంశాలు ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున భారీగా సిబ్బంది, రాజకీయ పార్టీ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది రాకపోకలు ఉండే అవకాశం ఉన్నందున, ముందస్తుగా అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, సీఐలు చంద్రబాబు నాయుడు, తేజోమూర్తి, డిసిపి శబ్నం శాస్ర్తీ, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, డీఈఈలు నరేష్, పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాసన్, ఏఈ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.













