రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: ధర్మవరం : హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నగరంలో జరగనున్న 16వ జాతీయస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి. సూర్యప్రకాష్ వెల్లడించారు. ధర్మవరం కు చెందిన క్రీడాకారులు ప్రశాంత్, నవీన్ కుమార్, మహమ్మద్ రఫీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే ఈ జట్టుకు కోచ్గా సత్యసాయి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ హాకీ కోచ్ హస్సేన్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు బి. సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఝాన్సీ లో జరగనున్న ఈ టోర్నమెంట్లో గ్రూప్ లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ను కూడా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు ఈ పోటీల్లో 10వ తేదీ గుజరాత్, 12వ తేదీ బీహార్, 13వ తేదీ రాజస్థాన్ రాష్ట్ర జట్లతో తలపడనుంది.
రాష్ట్ర జట్టుకు ఎంపికైన సత్యసాయి జిల్లా క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ బి. సూర్యప్రకాష్, హాకీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బీ. వీ. శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ గౌరీ ప్రసాద్, ఉడుముల రామచంద్ర, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ సెక్రటరీ అరవింద్ గౌడ్, చందు, మారుతీ కుమార్, డైరెక్టర్లు ఇర్షాద్, అమునుద్దీన్, కిరణ్, ఫిజికల్ డైరెక్టర్లు ఓబిలేసు, రఘునాథ రావు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
సత్యసాయి జిల్లా నుంచి జాతీయస్థాయి హాకీ పోటీలకు క్రీడాకారులు, కోచ్ ఎంపిక కావడం స్థానిక క్రీడా వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది. జిల్లా స్థాయిలో హాకీ అభివృద్ధికి ఇది ప్రోత్సాహకర పరిణామంగా క్రీడా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.













