శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ఠమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఎన్నికల సంసిద్ధత, నిబంధనలు, భద్రతా చర్యలపై వివరించారు.

జిల్లాలో మొత్తం 11,35,917 మంది ఓటర్లు ఉన్నారని, గతంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కోసం రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన పోస్టర్లు, ప్రచార సామగ్రిని తొలగించే చర్యలు ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారం, ప్రకటనలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ అనుమతి ప్రక్రియలో పోలీసు శాఖ కూడా భాగస్వామ్యమవుతుందని తెలిపారు. అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించేందుకు ఎక్స్‌పెండిచర్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేసినా, అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచార సమయాలను తప్పనిసరిగా పాటించాలని, ఓటర్లకు డబ్బులు లేదా ఇతర ప్రలోభాలు చూపడం పూర్తిగా నిషిద్ధమని అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే రావాలని, ప్రతిపాదన సమయంలో అభ్యర్థితో పాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయరాదని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాత్రి 9 గంటలకే లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు.

సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రచారం, ప్రకటనలను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్, మున్సిపాలిటీ స్థాయిలో మీడియా మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని మొత్తం 467 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా, వార్డు సభ్యుల డీలిమిటేషన్‌ను పంచాయతీ అధికారులు చేపడుతున్నారని వివరించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి మొదటి, రెండో, మూడో దశల తేదీలను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ కోరారు.

ఈ సమావేశంలో డీఆర్వో కొండయ్య, జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, డీఎఫ్‌ఓ చక్రపాణి తదితర అధికారులు పాల్గొన్నారు.