రాయలసీమ న్యూస్, ఎడ్యుకేషన్ డెస్క్:
ఏపీ EAPCET 2026 ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న AP EAPCET 2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు.
ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,76,572 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 2,58,545 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 1,82,317 మంది ఉత్తీర్ణులయ్యారని, ఉత్తీర్ణత శాతం 70.52గా నమోదైందని మంత్రి నారా లోకేశ్ వివరించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా, 70,929 మంది పరీక్ష రాశారు. వీరిలో 63,546 మంది ఉత్తీర్ణులయ్యారని, ఈ విభాగంలో ఉత్తీర్ణత శాతం 89.59గా ఉందని ఆయన తెలిపారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాప్-10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇలా ఉన్నారు. గుంటూరు జిల్లా జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి, శ్రీకాకుళం నుంచి కోరుకొండ శ్రావ్య, పల్నాడు నుంచి వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి, తుంగ దుర్గా సుప్రభాత్, హైదరాబాద్ నుంచి తెల్లూరి శ్రేయస్ రెడ్డి, వైఎస్‌ఆర్ కడప నుంచి ముక్కార సాకేత్, గుంటూరు నుంచి బండి వెంకట సాత్విక్, నూర్ బాషా హఫీజ్, కడప నుంచి పసల మోహిత్, వైఎస్‌ఆర్ కడప నుంచి మరక వంశీధర్ రెడ్డి టాప్ ర్యాంకులు సాధించారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్‌లో శంబంగి జశ్వంత్ నాయుడు (విజయనగరం),కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి (మేడ్చల్ మల్కాజ్‌గిరి), కొండ్రెడ్డి హారిక దేవి శ్రీ అనూహ్య (కృష్ణా), కర్రి సత్యనారాయణ (కాకినాడ), బంటు ధాత్రిక (అనకాపల్లి), పల్లికొండ దర్శ్తేజ (కాకినాడ), వల్లెపు ధీరజ్ కృష్ణ (గుంటూరు), దండమూడి జాగృతి (గుంటూరు), ఆళ్ల శ్రీలక్ష్మి సత్య సాయి నిఖిత (పల్నాడు), రేలంగి జయ షణ్ముఖ (విజయనగరం) టాప్-10 ర్యాంకర్లు గా నిలిచారు.
AP EAPCET 2026 ఫలితాల విడుదలతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. ర్యాంకుల ఆధారంగా త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలు, ర్యాంకులు, కౌన్సెలింగ్ సంబంధిత తదుపరి సూచనలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లు, ప్రకటనల ద్వారా గమనించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.







