రాయలసీమ న్యూస్, ఎడ్యుకేషన్ డెస్క్:
ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు వెల్లడి కావడంతో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించారు. ఈ మేరకు తొలి విడత ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. జులై 20 నుంచి 29 వరకు మొత్తం పది రోజుల పాటు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగనుంది.
విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జులై 22 నుంచి 31వరకు చేపట్టనున్నారు. జులై 25 నుంచి 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1న వెబ్‌ఆప్షన్లు మార్చుకొనేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 6న తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 7 నుంచి 13వ తేదీ వరకు కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్/ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.







