రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు (73) ఇకలేరు. ఆయన మృతిచెందిన విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నారాయణ రావు మరణ వార్త సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
జీవీ నారాయణ రావు 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందిన నారాయణ రావు, రజనీకాంత్, చిరంజీవిలకు సన్నిహిత మిత్రుడిగా పేరుపొందారు.
‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి అనేక ప్రముఖ చిత్రాల్లో ఆయన నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు శుభం నాకు వంటి సినిమాలను నిర్మించారు.
కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణ రావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన, గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్.కృష్ణ వద్ద నటనలో శిక్షణ పొందారు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలలో నటిస్తూ రంగస్థలంపై తన ప్రతిభను నిరూపించారు.
రంగస్థలంలో ఆయనకు దివంగత నటులు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు సన్నిహిత మిత్రులు. సినిమాలతో పాటు పలు టి.వి. సీరియళ్లలో కూడా నారాయణ రావు నటించారు. తెరపైన, రంగస్థలంపై సమానంగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కళాకారుడిగా ఆయన గుర్తింపు పొందారు.
జీవీ నారాయణ రావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. నారాయణ రావుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ విదేశాల్లో నివసిస్తున్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ రంగం ఓ అనుభవజ్ఞుడైన నటుడిని కోల్పోయిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













