పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది డే గా మారింది. సాధారణంగా మీడియాలో ఎక్కువగా కనిపించని అన్నా, ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన భావాలు, అనుభూతులను పంచుకుంటూ ఉండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా చేసిన ఎమోషనల్ పోస్ట్ విస్తృతంగా చర్చనీయాంశమైంది.

ఎక్స్ వేదికగా అన్నా లెజినోవా రాసిన ఈ పొడవైన నోట్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలు, కుటుంబంగా వారు అనుభవించిన మానసిక ఒత్తిడిని ఆమె ప్రస్తావించారు. విజయాల వెనుక దాగి ఉన్న కష్టాలు, పోరాటం గురించి చాలా మంది గ్రహించరని ఆమె పేర్కొంది.

జనాలు కేవలం పత్రికల్లో వచ్చే ఫోటోలని, ముఖాల్లోని నవ్వులు, సంబరాలు, విజయాన్ని మాత్రమే చూస్తారు. కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్న ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటాన్ని, కష్టాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చూడగలరు. ప్రపంచమంతా తనకి వ్యతిరేకంగా నిలబడినట్లు అనిపించిన ఆ రాత్రి పగళ్లని చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. రాజకీయాల్లో ఆయన్ని ఎందరో అవమానించారు, ఎగతాళి చేశారు, రకరకాల పేర్లతో దూషిస్తూ నిరంతరం ప్రశ్నించారు. ప్రజల కోసం ఆయన యుద్ధాలు చేస్తున్నప్పుడు, నేను ఇంట్లో మా పిల్లల కోసం మానసికంగా ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నించేదాన్ని. చాలా సందర్భాలలో నన్ను నేను పూర్తిగా ఒంటరిగా భావించాను. నేను కూడా పూర్తిగా కుంగిపోవాలనిపించిన రోజులు, ఎంతో భయపడిన రోజులు ఉన్నాయి. కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం ఒకే ఒక్క మనిషి ఇంతకంటే ఇంకెంత భరించగలడు అని నేను నిరంతరం ఆలోచించేదాన్ని.

అన్నా లెజినోవా తన పోస్ట్‌లో ఈ విజయాన్ని కేవలం రాజకీయ విజయం కాదని, మానవీయ కోణంలో ఎంతో భావోద్వేగంతో అనుభవించామని పేర్కొంది. ఇన్నేళ్లుగా వారు అనుభవించిన గుండెకోత ఒక్క క్షణంలో ఆనందంగా మారిపోయిందని ఆమె భావోద్వేగంగా వివరించింది.

దానివల్ల మా జీవితం లగ్జరీగా, సుఖంగా మారుతుందని కూడా కాదు. కేవలం కొందరు వ్యక్తులు తమ అంతరాత్మని ఎప్పటికీ వంచించుకోలేరు. బహుశా అందుకేనేమో ఈ విజయం మాకెంతో భావోద్వేగంగా అనిపించింది. ఇది కేవలం రాజకీయపరమైనది కాదు. అంతకుమించిన మానవీయమైనది. ఇన్నేళ్ల మా గుండెకోత, ఒక్క క్షణంలో అంతులేని ఆనందంగా మారిపోయింది. ప్రమాణ స్వీకార మహోత్సవంలో కళ్లల్లో నీళ్లతో నేను అక్కడ నిలబడిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. చివరికి నా కన్నీళ్లని ప్రధాని మోదీజీ కూడా గమనించారు. అవి బాధతో వచ్చినవి కావు. కొన్నిసార్లు దేవుడు మనుషులని సంవత్సరాల తరబడి కుంగిపోయేలా చేస్తాడు, అవమానిస్తాడు, కఠినంగా పరీక్షిస్తాడు… కానీ చివరికి అదే ప్రపంచం ముందు వారి గౌరవాన్ని అంతకంతకూ రెట్టింపు చేసి సగర్వంగా తిరిగి ఇస్తాడు.

ఆ అద్భుత క్షణంలో తనకు కలిగిన భావోద్వేగాన్ని కూడా అన్నా ప్రత్యేకంగా ప్రస్తావించింది. పవన్ కళ్యాణ్‌పై తన గర్వాన్ని ఆమె స్పష్టంగా వ్యక్తం చేసింది.

ఆ అద్భుత క్షణంలో నాకేమనిపించిందని ఎవరైనా నన్ను అడిగితే, నాకు కేవలం గర్వంగా అనిపించింది అని మాత్రమే చెబుతాను. ఓటమిని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడని ఆ వ్యక్తిని చూసి ఎంతో గర్వపడ్డాను. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది పవన్ కళ్యాణ్.

అన్నా లెజినోవా ఈ పోస్ట్‌తో పాటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ భావోద్వేగపూరిత రచన మెగా అభిమానులు, జనసైనికులతో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. కుటుంబ సభ్యురాలిగా ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, పవన్ కళ్యాణ్‌పై ఉన్న నమ్మకం, గర్వం ఈ పోస్ట్‌లో స్పష్టంగా ప్రతిబింబించాయి.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో TDP, BJPలతో కూటమి కట్టి ఘన విజయం సాధించారు. అనంతరం ఇదే రోజు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రాజకీయ మలుపు సమయంలో కుటుంబంగా అనుభవించిన భావోద్వేగాలను అన్నా లెజినోవా ఈ పోస్ట్ ద్వారా బయటపెట్టడం విశేషంగా మారింది.