రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
‘భారత్ భాగ్య విధాత’.. ఆగస్టు 14న ఓటీటీలోకి
2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడులు దేశ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఆ భయానక రాత్రి ప్రజలు, భద్రతా దళాలు, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. ఈ నేపథ్యంలో కామా, అల్బ్లెస్ ఆసుపత్రుల్లో నిశ్శబ్దంగా సాగిన మరో యుద్ధాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన చిత్రమే కంగనా రనౌత్ నటించిన ‘భారత్ భాగ్య విధాత’.
26/11 దాడుల గురించి ఎన్నో కథలు వినిపించినప్పటికీ, ఆసుపత్రి గోడల మధ్య రోగుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వైద్యులు, నర్సులు, వార్డ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల సాహసగాథ పెద్దగా బయటకు రాలేదు. ఆయుధాలు లేకపోయినా, తమ ముందున్న ప్రాణాలను కాపాడేందుకు వారు ప్రదర్శించిన అసాధారణ ధైర్యాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
‘భారత్ భాగ్య విధాత’ కథ 26/11 ముంబై ఉగ్రదాడుల యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. ముంబైలోని కామా హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నిజజీవితంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను కోర్టులో ధైర్యంగా గుర్తించిన నర్స్ అంజలి కులాతె పాత్ర స్ఫూర్తితో రూపొందించిన ‘ గీతమాధవ్ అనే నర్స్ పాత్రలో కంగనా రనౌత్ కనిపిస్తుంది.
ఉగ్రవాదులు హాస్పిటల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని రక్తపాతం సృష్టిస్తున్న ఆ చీకటి రాత్రి, గీతమాధవ్ తో పాటు అక్కడి వైద్య సిబ్బంది, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు 400 మంది రోగులను, ముఖ్యంగా 20 మంది గర్భిణీ స్త్రీలను ఉగ్రవాదుల బారి నుంచి సురక్షితంగా కాపాడతారు. కష్టకాలంలో సాధారణ మనుషులు సైతం ఎలా వీరులుగా మారి దేశభక్తిని చాటారనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
కంగనా రనౌత్, గిరిజ ఓక్ , స్మిత తాంబే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిందీ భాషలో థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది. మనోజ్ టపాడియా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 జూన్ 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందనను సాధించింది.
ఇప్పుడు ‘భారత్ భాగ్య విధాత’ ఓటీటీ ప్రేక్షకులను కూడా చేరుకోబోతోంది. మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం 2026 ఆగస్టు 14న హిందీ Zee5లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ థ్రిల్లర్‌ను వీక్షించే అవకాశం పొందనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ఈ సినిమాను డిజిటల్‌గా విడుదల చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. దేశభక్తి, మానవత్వం, అజ్ఞాత వీరుల త్యాగాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ‘భారత్ భాగ్య విధాత’ ఓటీటీ వేదికపైకి అడుగుపెట్టబోతోంది.







