రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ‘‘మునుపెన్నడూ చూడని లవ్‌స్టోరీ’’గా ప్రేక్షకుల ముందుకు రానున్న కొత్త చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. ఈ చిత్రంలో కథానాయకుడు కిరణ్ అబ్బవరం, కథానాయిక శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సాయి రాజేశ్ కథ అందించడంతో పాటు ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించారు. బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం జులై 24న థియేటర్లలో విడుదల కానుంది.
విజయవాడలో శనివారం రాత్రి ఈ చిత్రంలోని ‘‘హొయిల హొయిల..’’ అనే గీతాన్ని ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రబృందం మొత్తం ఈ వేడుకలో పాల్గొంది.
‘‘ప్రతి ఒక్కరికీ చాలా రోజుల పాటు గుర్తుండిపోయే సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. ఇందులో బలమైన భావోద్వేగాలున్నాయి. ఇది తప్పకుండా క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది’’ అన్నారు కథానాయకుడు కిరణ్ అబ్బవరం.
విజయవాడలో జరిగిన పాట విడుదల కార్యక్రమంలో రఘురామ కృష్ణంరాజు చిత్రంపై ప్రశంసలు కురిపించారు. హీరో, హీరోయిన్ నటనను ఆయన మెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, నిర్మాణ వ్యయాల తగ్గింపు కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా 24 క్రాఫ్ట్స్ వర్గానికి కాలనీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి చిత్రాలు మరింత సంఖ్యలో రూపొందే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘పేరుకిది ‘చెన్నై లవ్‌స్టోరీ’ అయినా సింహభాగం ఏపీలోని అందమైన సముద్ర తీర ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ సింగిల్ విండో విధానంలోనే చిత్రీకరణలకు అనుమతులిచ్చేలా ఏపీ ప్రభుత్వం నూటికి నూరు శాతం సహకరిస్తుంది’’ అన్నారు మంత్రి కందుల దుర్గేశ్.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘వెండితెరపై మునుపెన్నడూ చూడని ప్రేమకథ చూడబోతున్నారు’’ అన్నారు.







