రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
‘గుర్తుకొస్తున్నాయి’..
పెళ్లికి ముందు అన్నీ మర్చిపోతే..
మతిమరుపు నేపథ్యంతో వచ్చిన కొత్త వెబ్‌సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. శరత్ చంద్ర నాయుడు నిర్మించిన ఈ సిరీస్ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) ఒక స్కూల్ ప్రిన్సిపల్. కఠిన నియమాలు, క్రమశిక్షణకు పేరున్న వ్యక్తి. సంతోష్ (విరాజ్ అశ్విన్) చిన్నప్పటి నుంచే రఘునాథ్ కుమార్తె వైశాలి (యశశ్రీ రావు)ని ప్రేమిస్తూ ఉంటాడు. అనేక సవాళ్ల తర్వాత రఘునాథ్ ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కుదిరిన ఆనందంలో సంతోష్ తన చిన్ననాటి స్నేహితులు బొమ్మ ఆనంద్ (గోదావరి గోపి), గణేశ్ (వివా రాఘవ), శ్రీకాంత్ (పవన్ సిద్దు)లతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకు వెళ్తాడు.
అక్కడ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో సంతోష్ తన గతాన్ని మర్చిపోతాడు. కేవలం కొద్ది రోజుల కిందట జరిగిన సంఘటనలే అతనికి గుర్తుంటాయి. పెళ్లికి ముందు ఇలా జరగడంతో సంతోష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనకు గురవుతారు. పెళ్లి జరిగేలోపు పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగుతారు. సంతోష్‌కు గతం గుర్తు చేయడానికి వారు ఏం చేశారు? అతనికి మతి మరుపు వచ్చిందన్న విషయం బయటపడకుండా ఎలా దాచారు? వైశాలి కుటుంబానికి ఈ నిజం తెలిసిందా? అన్న ప్రశ్నలకు సమాధానం సిరీస్ ద్వారా తెలుస్తుంది.
మతిమరుపు కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు వచ్చిన అనేక చిత్రాలు మంచి వినోదాన్ని పంచాయి. ఈ కాన్సెప్ట్‌లో లాజిక్ కంటే ఎమోషన్, కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ‘గుర్తుకొస్తున్నాయి’లో కూడా అదే పంథాను దర్శకుడు వినోద్ అనుసరించారు. సంతోష్ కుటుంబం, స్నేహం, ప్రేమ ఇలా అన్ని కోణాలను పరిచయం చేస్తూ సిరీస్‌ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు. గోవా ట్రిప్‌లో జరిగిన ప్రమాదంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.
సంతోష్ గతం మర్చిపోయాడన్న విషయం బయటపడకుండా, ముఖ్యంగా వైశాలి కుటుంబానికి తెలియకుండా చూసే క్రమంలో పాత్రలు పడే టెన్షన్, దాని నుంచి పుట్టే హాస్యం సిరీస్‌కి ప్రధాన బలం. రెండు టైమ్‌లైన్‌ల మధ్య కథను నడిపిస్తూ, వర్తమానంతో పాటు చిన్ననాటి జ్ఞాపకాలను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. గతం కంటే వర్తమానంలో జరిగే సంఘటనలపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో మతి మరుపు డ్రామా, దాని నుంచి వచ్చే కామెడీ హైలైట్‌గా నిలిచాయి.
మొదటి మూడు ఎపిసోడ్‌లు కాస్త నెమ్మదిగా సాగినా, నాలుగో ఎపిసోడ్ నుంచి కథ వేగం అందుకుంటుంది. కొత్త పాత్రలు ప్రవేశించడం, సంతోష్ విషయం బయటపడకుండా అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎదుర్కొనే సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి. స్కూల్ రోజుల్లోని సంఘటనలను మళ్లీ సృష్టించే సన్నివేశాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. చివరి మూడు ఎపిసోడ్‌లు మరింత ఆకర్షణీయంగా సాగుతాయి. చిన్ననాటి జ్ఞాపకాలతో నిండిన సన్నివేశాలు హృద్యంగా ఉంటాయి. ప్రేక్షకులకూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేలా చేస్తాయి.
చివరి ఎపిసోడ్‌లో చూపించిన భావోద్వేగ సన్నివేశాలు, ట్విస్ట్ రివీల్ చేసిన తీరు భావోద్వేగభరితంగా ఉండటంతో పాటు, కథకు అర్థవంతమైన ముగింపునిచ్చాయి. సంతోష్ పాత్రలో విరాజ్ అశ్విన్ నటన బాగుంది. హావభావాలతో పాత్రలో లీనమయ్యాడు. యశశ్రీ తన పాత్రకు న్యాయం చేసింది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో వివా రాఘవ, పవన్ సిద్దు, గోదావరి గోపి, శివన్నారాయణ నటన సిరీస్‌కు అదనపు బలాన్ని ఇచ్చింది. రోహిణి హట్టంగడి, రామ్‌ల పాత్రలు కూడా బాగా నడిచాయి.
సాంకేతికంగా సిరీస్ మెరుగ్గా ఉంది. సుహాస్ సంగీతం, రేహాన్ షేక్ సినిమాటోగ్రఫీ, శ్రీధర్ సోంపల్లి, వెంకటేష్ చుండూరు ఎడిటింగ్ సిరీస్‌కు తోడ్పడ్డాయి. మెమొరీలాస్ కాన్సెప్ట్‌ను వినోద్ గాలి కొత్తగా ప్రజెంట్ చేశారు. ఉన్న పాత్రలతోనే కథను సాగదీయకుండా, ఎప్పటికప్పుడు కొత్త పాత్రలను తెరపైకి తీసుకురావడం ద్వారా కథలో సంఘర్షణను పెంచిన తీరు బాగా వర్కౌట్ అయింది. భావోద్వేగ సన్నివేశాలను తనదైన శైలిలో చూపించారు.
కుటుంబంతో కలిసి చూడదగిన సిరీస్‌గా ‘గుర్తుకొస్తున్నాయి’ నిలిచింది. మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్ సుమారు అరగంట నిడివి కలిగి ఉంది. బలాల పరంగా నటీనటుల నటన, కామెడీ, చివరి మూడు ఎపిసోడ్‌లు ప్లస్ పాయింట్లుగా నిలిస్తే, ఆరంభ ఎపిసోడ్‌ల నెమ్మదితనం మాత్రం మైనస్‌గా భావించవచ్చు. మొత్తంగా చూసుకుంటే ‘గుర్తుకొస్తున్నాయి’ ఫన్ రైడ్ విత్ ఎమోషన్స్‌గా చెప్పుకోవచ్చు.
రేటింగ్: 2.5/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.







