శేఖర్‌ మాస్టర్‌కు నాకూ గొడవలు లేవు

: స్పష్టం చేసిన జానీ మాస్టర్‌

నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌తో తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్‌ అన్నారు. డ్యాన్సర్స్‌ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. యూనియన్ పెద్దల జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది.

ఈ సందర్భంగా సోమవారం జానీ మాస్టర్‌ విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు లేరని, తమ యూనియన్‌, డ్యాన్సర్ల కోసం తాము పనిచేస్తామన్నారు. తాను, శేఖర్‌ మాస్టర్‌ ఈ రోజు మధ్యాహ్నం అగ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి భోజనం కూడా చేశామని, ఇరువురు సినిమాలు, పాటలు, డ్యాన్స్‌ స్టెప్‌లు సహా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు. శేఖర్‌ మాస్టర్‌ తనకు సోదరుడులాంటివారని తమకు ఏ సమస్య వచ్చిన పరస్పరం సహకరించుకుంటామని తెలిపారు.