ఇటీవలి కాలంలో బయోపిక్‌ల హవా ప్రపంచవ్యాప్తంగా గట్టిగా కొనసాగుతోంది. సెలబ్రిటీల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాలు ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాప్ సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందిన హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్ ప్రపంచ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అంటోనీ ఫుక్కుత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్పందనను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘మైఖేల్’ సినిమా వరల్డ్‌వైడ్‌గా 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఒక్క నార్త్ అమెరికా మార్కెట్లోనే ఈ చిత్రం సుమారు 372 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, అంతర్జాతీయ మార్కెట్లలో మరో 629 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

మొత్తం కలిపి భారతీయ కరెన్సీ ప్రకారం ఈ చిత్రం రూ. 9,500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్‌గా ‘మైఖేల్’ చరిత్ర సృష్టించింది. ఈ ప్రభంజనంతో గతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజికల్ బయోపిక్ బొహేమియాన్ ర్హపిసోడే ’ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టింది. సుమారు 911 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టి మైఖేల్ ’ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

మైఖేల్ జాక్సన్ హావభావాలు, ఐకానిక్ డ్యాన్స్ స్టైల్స్, స్టేజ్ ఎనర్జీని జాఫర్ జాక్సన్ అత్యంత నైపుణ్యంతో రీ-క్రియేట్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. మైఖేల్ జాక్సన్ బాల్యం నుంచి గ్లోబల్ పాప్ స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని భావోద్వేగపూరితంగా ఆవిష్కరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.