‘నాగబంధం’ రివ్యూ..

‘పెదకాపు’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విరాట్‌ కర్ణ కథానాయకుడిగా రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘నాగబంధం’. ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పురాతన రహస్యాలు, నాగబంధం సంప్రదాయం చుట్టూ తిరిగే ఈ కథను దర్శకుడు అభిషేక్‌ నామా భారీ విజువల్‌ కాన్వాస్‌పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

1960 దశకంలో సాగే ఈ కథలో పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్‌ (జగపతిబాబు)తో కలిసి పరిశోధనలు చేసే స్కాలర్లు అబ్దాలీ (రిషబ్‌ సాహ్నీ), టెస్లా హిమాలయాల్లో నాగబంధం విముక్తికి సంబంధించిన రహస్య పుస్తకాన్ని కనుగొంటారు. టెస్లా ఆ పుస్తకాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని చూస్తుండగా, అబ్దాలీ మాత్రం స్వార్థపూరిత లక్ష్యాలతో దానిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. నాగబంధం విముక్తిలో శ్రీరంగనాథ స్వామి నాభిపై అలంకరించిన బ్రహ్మకమలం కీలకమని తెలుసుకున్న అబ్దాలీ, దాన్ని చేజిక్కించుకుని కాలవృక్ష బంధనంలో ఉన్న భైరాగి (గరుడ రామ్‌)తో కలిసి బ్రహ్మాండాన్ని శాసించాలనే కుట్ర పన్నుతాడు.

ఈ ప్రయత్నంలో భాగంగా అబ్దాలీ గ్యాంగ్‌ ఓ గూడెంలో నివసిస్తున్న రుద్ర (విరాట్‌ కర్ణ) కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆ తర్వాత బ్రహ్మకమలం వారి చేతికి చిక్కిందా? రుద్ర కుటుంబం వరకు రావాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడింది? అధర్మం మితిమీరినప్పుడు ధర్మరక్షణ కోసం రుద్ర ఏం చేశాడు? 17వ శతాబ్దంలోని నాగసాధువు శివకీ, రుద్రకీ మధ్య సంబంధం ఏమిటి? రుద్ర జీవితంలోకి వచ్చిన పార్వతి (నభా నటేశ్‌) పాత్ర ఏ విధంగా మలుపు తిప్పింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై వెల్లడవుతాయి.

పురాణాలు, సనాతన ధర్మం, థియేట్రికల్‌ అనుభవాన్ని ఇచ్చే విజువల్‌ హంగులు వంటి ప్రస్తుతం వాణిజ్యపరంగా ఆకర్షణీయంగా మారిన అంశాలన్నింటినీ ఒకేచోట చేర్చి కథ అల్లినట్టు ‘నాగబంధం’ కనిపిస్తుంది. ట్రైలర్‌ నుంచే విజువల్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం, ఆ అంచనాలకు తగ్గట్టుగా దృశ్యపరంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా మొత్తం దాదాపు ప్రతి ఐదు–పది నిమిషాలకు కొత్తరకం ఫ్రేమ్‌లు కనిపిస్తూ కంటికి విందు పంచుతాయి. సుందర్‌ రాజన్‌ ఎస్‌ సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్‌ పనితనం చిత్రానికి ప్రధాన బలం. యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.

అయితే కథ, పాత్రలు లార్జర్‌ దెన్‌ లైఫ్‌ హంగులను డిమాండ్‌ చేసే స్థాయిలో ఉండకపోవడం గమనార్హం. హంగులు, సెట్టింగులు, విజువల్స్‌ కోసం కథను పక్కన పెట్టిన భావన కలుగుతుంది. బలమైన కథ, లోతైన భావోద్వేగాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. హిమాలయాల్లో పుస్తకం కనుగొనడం, దాని చుట్టూ సంఘర్షణ, తర్వాత హీరో ప్రపంచాన్ని పరిచయం చేయడం, కుటుంబ నేపథ్యంలోని డ్రామా మొదలైనవి మొదట్లో ఆసక్తికరంగా సాగినా, తర్వాత కథ మలుపులు తీసుకునే సమయంలో డ్రామా తీవ్రత తగ్గిపోతుంది. విలన్‌ గ్యాంగ్‌తో కలిసి హీరో భైరవకోనకు వెళ్లాలని నిర్ణయించుకోవడం, అవసరం లేని చోట హీరో ‘బ్రహ్మకమలాన్ని నేనే తెస్తా’ అన్నట్టుగా సాహసాలకు పూనుకోవడం వంటి అంశాలు కథనాన్ని బలహీనపరుస్తాయి. మధ్య మధ్యలో అనూహ్యంగా వచ్చే పాటలు కూడా నరేషన్‌ పేస్‌ను దెబ్బతీస్తాయి.

ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ బాగా రూపుదిద్దుకున్నప్పటికీ, అప్పటికే నిడివి, సుదీర్ఘ యాక్షన్‌ కారణంగా క్లైమాక్స్‌ చూసేశామేమో అన్న భావన కలుగుతుంది. ద్వితీయార్థం ఆరంభంలో హీరోయిన్‌ చెప్పే కథ కొంత డ్రామాను పెంచినా, తర్వాత మళ్లీ పాత బాటే. ఒక్కసారిగా కథ 17వ శతాబ్దానికి వెళ్లే ఎపిసోడ్‌లో కూడా బ్రహ్మకమలం, అదే విలన్‌, అవే దురాగతాలు పునరావృతమవుతాయి. హీరో పాత్ర గెటప్‌ మారడం తప్ప కథపరంగా పెద్ద మార్పు ఉండదు. చివర్లో అధర్మం మితిమీరినప్పుడు ధర్మపరిరక్షణ జరుగుతుందని, సనాతన ధర్మం విశిష్టతను చూపిస్తూ దర్శకుడు ముగింపు పలికినా, నాగబంధం విముక్తి వల్ల ఏమవుతుంది? బ్రహ్మాండాన్ని శాసించడం అంటే ఏమిటి? వంటి ప్రశ్నలకు లోతైన సమాధానాలు ఇవ్వకుండా మరో భాగం కోసం ఎదురుచూడమనే సూచనతో ‘శుభం’ కార్డు పడుతుంది.

విరాట్‌ కర్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించారు. రెండు పాత్రల మధ్య నటనపరంగా పెద్ద వైవిధ్యం లేకపోయినా, గెటప్పులు బాగా నప్పాయి. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో ఆయన నటన మెరుగ్గా అనిపిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు, క్లైమాక్స్‌ ఫైట్‌ సన్నివేశాలు బాగా పనిచేశాయి. నభా నటేశ్‌ పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ. ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా రూపుదిద్దుకోవడంతో పాటు నటనకు కూడా మంచి స్కోప్‌ దక్కింది. దక్ష, ఐశ్వర్య మేనన్‌ పాత్రలు పరిమితంగానే ఉన్నా, తమ పరిధిలో న్యాయం చేశారు. ప్రతినాయకుడిగా రిషబ్‌ సాహ్నీ బాగానే ఇంప్రెస్‌ చేశారు. భైరాగి పాత్రలో గరుడ రామ్‌ ఎంట్రీ, గెటప్‌ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అనసూయ, సోనియా సింగ్‌, శరణ్య, అంకిత్‌ కొయ్య పాత్రలు ఫస్ట్‌ హాఫ్‌లో ప్రభావం చూపుతాయి. మురళీ శర్మ, మహేశ్‌ మంజ్రేకర్‌ పాత్రలు సెకండ్‌ హాఫ్‌లో కీలకంగా నిలుస్తాయి.

సాంకేతికంగా ‘నాగబంధం’ బలంగా నిలిచింది. సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రఫీ, అశోక్‌ కళా రూపకల్పన చిత్రానికి ప్రాణం పోశాయి. శ్రీరంగపురం దేవాలయం నుంచి ద్వితీయార్థంలో కనిపించే విరాటపురుషాలయం వరకు ప్రతి సెట్‌ భారీదనంతో ఆకట్టుకుంటుంది. జునైద్‌ కుమార్‌, అభి సంగీతం, ముఖ్యంగా పాటలు బాగున్నాయి. ‘నమోరే’, పెళ్లి పాటల చిత్రణ గ్రాండియర్‌గా అనిపిస్తుంది. సినిమాలో అడుగడుగునా పాముల విజువల్స్‌ కనిపిస్తుండగా, జగపతిబాబు హెలికాప్టర్‌ కూలిపోయే సన్నివేశం మినహా మిగతా వీఎఫ్‌ఎక్స్‌ సహజంగా కుదిరాయి. అయితే నిడివి మాత్రం ప్రధాన మైనస్‌. దర్శకుడు అన్ని విభాగాలను సమర్థంగా నడిపిస్తూ, అనుకున్న కథను ఆత్మవిశ్వాసంతో తెరపైకి తీసుకొచ్చినా, రచనలో పదును, బలమైన భావోద్వేగాలు జోడించి ఉంటే చిత్రం మరోస్థాయికి వెళ్లేదనే భావన కలుగుతుంది.

రేటింగ్‌: 2.5/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)