రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించినప్పుడల్లా దేశవ్యాప్తంగా చర్చలు, వాదోపవాదాలు చెలరేగడం సాధారణం. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ తమ భాష సినిమాలు, తమ హీరోల కృషి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రం తమిళనాడులో, ముఖ్యంగా కోలీవుడ్ పరిశ్రమలో జాతీయ అవార్డుల ఎంపికపై అసంతృప్తి స్వరం బలంగా వినిపిస్తోంది.
ఉత్తమ చిత్రం (తమిళం) విభాగంలో ‘రాయన్’ సినిమాకు అవార్డు రావడం ఈ చర్చకు కేంద్రబిందువైంది. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుల సినిమాలు, ఇండస్ట్రీలో కల్ట్‌గా నిలిచిన, విపరీతంగా కష్టపడి తీసిన చిత్రాలను పక్కనపెట్టి.. సగటు యాక్షన్ సినిమాకు అవార్డు ఎలా ఇస్తారు అనే ప్రశ్నను తమిళ సినీ అభిమానులు, కొంతమంది సినీ ప్రముఖులు లేవనెత్తుతున్నారు.
అవార్డుల ఎంపిక విధానం గురించి పూర్తి అవగాహన లేని కొందరు మాత్రం ఫ్లాప్ సినిమాలకు ఎలా అవార్డు ఇస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ ఫలితాలకతీతంగా, జ్యూరీ నిర్ణయాలు సృజనాత్మకత, కథనం, సాంకేతిక నైపుణ్యం వంటి అంశాల ఆధారంగా ఉంటాయని మరో వర్గం గుర్తుచేస్తోంది.
‘రాయన్’ కోసం ధనుష్ అండ్ టీం పడ్డ కష్టాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయడం లేదు. కానీ అదే సమయంలో, ఆ సినిమాకంటే ఎక్కువ శ్రమ, సృజనాత్మకతతో రూపొందిన కొన్ని చిత్రాలను విస్మరించడం తమకు నచ్చలేదని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విక్రమ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తంగళాం’ గురించి సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. విక్రమ్ ఆ పాత్రలో జీవించేశాడని, కథ, కథనం, పాత్రల చిత్రణ అన్నీ జాతీయ అవార్డు స్థాయిలో ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వస్తుందని, కనీసం ఉత్తమ చిత్రం (తమిళం) విభాగంలోనైనా గెలుస్తుందని Kollywoodలో చాలామంది ముందుగానే ఊహించారు. అయితే ఆ విభాగంలో కూడా ‘తంగళాం’కు అవార్డు రాకపోవడంతో జాతీయ అవార్డుల ఎంపిక విధానంపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, ‘రాయన్’ కోసం ధనుష్ పడ్డ కష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. నటన, సాంకేతికంగా కూడా ఆ సినిమా తన స్థాయిలో నిలిచిందనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ, ఇతర అర్హమైన చిత్రాలను పక్కన పెట్టి ‘రాయన్’ను ఎంపిక చేయడంపై ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఇటీవల 'పెద్ది’ సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి అవార్డుల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి.
అవార్డులు తెచ్చుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి
అని చిరంజీవి ఆ వేడుకలో వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారన్నది వేరే విషయం అయినప్పటికీ, జాతీయ చలన చిత్ర పురస్కారాల ఎంపికపై కోలీవుడ్ లో వినిపిస్తున్న విమర్శల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జాతీయ అవార్డుల విశ్వసనీయత, పారదర్శకతపై దేశవ్యాప్తంగా తరచూ చర్చలు జరుగుతుంటాయి. ఈసారి తమిళనాడులో ‘రాయన్’ ఎంపిక, ‘ తంగళాం’ వంటి చిత్రాల విస్మరణ మరోసారి అదే ప్రశ్నలను ముందుకు తెచ్చింది. సినీ వర్గాలు, అభిమానుల అసంతృప్తి మధ్య జ్యూరీ నిర్ణయాలపై అధికారిక స్పందన కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.







