ఈ సంక్రాంతి సందర్భంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయకుడు రవితేజ, వచ్చే ముగ్గుల పండుగను లక్ష్యంగా పెట్టుకుని మరో కొత్త చిత్రాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో కొనసాగుతోంది. ఈ చిత్రం వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉండగా, రవితేజ కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చిత్ర వర్గాల సమాచారం. దర్శకుడు హసిత్‌ గోలితో కలిసి ఆయన ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు హీరో శ్రీవిష్ణు కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇద్దరు హీరోల కలయికలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

హసిత్‌ గోలి శైలికి అనుగుణంగా వైవిధ్యభరితమైన వినోదాత్మక కథతో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రస్తుతం నటీనటుల ఎంపికతో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు యూనిట్‌ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారని సమాచారం. పూజా కార్యక్రమాల అనంతరం వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి సీజన్‌కి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారని పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వినోదం, భావోద్వేగాలు సమపాళ్లలో ఉండేలా కథను మలిచినట్లు యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ, శ్రీవిష్ణు కలయికలో వస్తున్న ఈ చిత్రం పండుగ సీజన్‌లో బాక్సాఫీస్‌ వద్ద మంచి హంగామా చేయగలదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తర్వాత రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారడం, ‘ఇరుముడి’తో పాటు హసిత్‌ గోలితో కొత్త సినిమా చేయడం ఆయన కెరీర్‌లో మరో కీలక దశగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. సంక్రాంతి పోటీలో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.