రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: హైదరాబాద్: నటుడు ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న RAW NTR సంస్థకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం వ్యక్తిగతంగా లేదా అధికారిక బృందం ద్వారా మాత్రమే వెలువడతాయని కార్యాలయం ప్రకటించింది.
RAW NTR పేరుతో జరుగుతున్న కార్యక్రమాలపై ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో, అభిమానుల వర్గాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ పేరు, ఫొటోలు, సేవా కార్యక్రమాల పేరుతో ఆ సంస్థ ప్రజల్లో తప్పుడు భావన కలిగించేలా వ్యవహరిస్తోందని కార్యాలయం అభిప్రాయపడింది.
‘‘RAW NTR’ పేరుతో నిర్వహిస్తున్న కార్యకలాపాలు మా దృష్టికి వచ్చాయి. ఆ సంస్థతో మాకెలాంటి సంబంధం లేదు. ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించేలా RAW NTR సంస్థ వ్యవహరిస్తోంది. ఆయన తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు దానికి లేదు. సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం మాత్రమే వెల్లడిస్తుంది. అనధికారిక వ్యక్తులు, సంస్థల ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు. అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతారని ఆశిస్తున్నాం. డిజిటల్, సోషల్ మీడియా వేదికలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ - NTR ఆఫీస్
ఈ ప్రకటనతో RAW NTR సంస్థ కార్యకలాపాలపై నెలకొన్న అనుమానాలు, ఊహాగానాలకు ముగింపు పలకాలని ఎన్టీఆర్ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు, డిజిటల్ వేదికలు ఎన్టీఆర్ పేరుతో వస్తున్న సమాచారాన్ని ముందుగా అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని, నిర్ధారణ లేని ప్రచారానికి దూరంగా ఉండాలని కార్యాలయం సూచించింది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ముందుగా ప్రకటించింది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మరో భారీ చిత్రాన్ని కార్తికేయుని కథాంశంతో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది.







