: కేంద్ర కమిటీ పరిశీలనకు పంపే యోచన

హైదరాబాద్, జూలై 8, 2026: పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సత్లుజ్’ సినిమా చుట్టూ వివాదం మళ్లీ చెలరేగింది. నాలుగేళ్లుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అడ్డంకులు, టైటిల్ మార్పులు, విడుదల వాయిదాలు ఎదుర్కొన్న ఈ చిత్రం, గత శుక్రవారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5లో విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే భారతీయ కేటలాగ్ నుంచి తొలగించబడింది.

ZEE5 భారతీయ కేటలాగ్ నుంచి ‘సత్లుజ్’ను తొలగించినట్లు ఆ సంస్థ ఆదివారం ప్రకటించింది. అయితే ZEE5 గ్లోబల్ లో మాత్రం ఈ సినిమా అందుబాటులో కొనసాగుతుందని స్పష్టం చేసింది.

“ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చే వరకు ‘సత్లుజ్’ భారతదేశంలో అందుబాటులో ఉండదు. సరైన ప్రక్రియ ద్వారా సినిమాను వీలైనంత త్వరగా మా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తగిన మార్గాలను అన్వేషించడానికి మేం కట్టుబడి ఉన్నాం”

ఈ ప్రకటనతో సినిమా తొలగింపు నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పంజాబ్‌లో 1980లు, 1990ల తిరుగుబాటు ఉద్యమం సమయంలో వేలాది గుర్తుతెలియని మృతదేహాలను అక్రమంగా దహనం చేశారనే విషయాన్ని జస్వంత్ సింగ్ ఖల్రా ప్రపంచానికి వెలుగులోకి తెచ్చారు. తిరుగుబాటు సమయంలో అదృశ్యమైన వారి మృతదేహాలను కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు రహస్యంగా దహనం చేసిన ఘటనలకు సంబంధించిన ఆధారాలను ఆయన డాక్యుమెంట్ చేశారు. ఈ దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించింది. అనంతరం 1995లో ఖల్రా హత్యకు గురయ్యారు. ఆయన కిడ్నాప్, హత్య కేసులో నలుగురు పోలీసు అధికారులకు జీవిత ఖైదు శిక్ష విధించబడింది.

ఖల్రా జీవితకథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు హనీ టెహ్రాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఖల్రా పాత్రను Diljit Dosanjh పోషించారు. రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో సీబీఎఫ్‌సీ నుంచి క్లియరెన్స్ పొందడంలో సినిమా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. బోర్డు భారీ మార్పులు, కట్‌లు సూచించిందని మేకర్స్ ఆరోపించారు.

ప్రారంభంలో 21 కట్‌లు సూచించిన సీబీఎఫ్‌సీ, తర్వాత ఏకంగా 127 కట్‌లు చేయాలని కోరింది. సినిమా నుంచి జస్వంత్ సింగ్ ఖల్రా పేరును కూడా తొలగించాలని బోర్డు కోరిందని దర్శకుడు హనీ టెహ్రాన్ ఆరోపించారు. ఈ కట్‌లను ఆయన అంగీకరించకపోవడంతో థియేటర్లలో విడుదల నిలిచిపోయింది. చివరికి అన్‌కట్ వెర్షన్‌గా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది.

సర్టిఫికేషన్ వివాదాల కారణంగా ఈ సినిమాకు మూడు సార్లు పేరు మార్చాల్సి వచ్చింది. మొదట సిక్కుల మారణహోమాలకు సంబంధించిన పదం ‘ఘల్లుఘరా’గా టైటిల్ పెట్టగా, తర్వాత ‘ పంజాబ్ 95’, తాజాగా ‘సత్లుజ్’ పేరుతో ఓటీటీలో విడుదలైంది.

సినిమాను ఓటీటీ నుంచి తొలగించే అవకాశం ఉందని డాల్జిత్ Dosanjh ముందుగానే సూచించారు. ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ఆయన ఇలా అన్నారు:

“ఈ రోజు శనివారం. సోమవారం నాటికి దీనిని తీసేయవచ్చని నేను భావిస్తున్నాను. అందుకే మీరు దీనిని డౌన్‌లోడ్ చేసుకోండి”

ఇదిలా ఉండగా, ‘సత్లుజ్’ సినిమాను సమగ్ర పరిశీలన, భద్రతాపరమైన తదుపరి చర్యల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ) రూల్స్ , 2021 ప్రకారం ఏర్పాటు చేసిన ఇంటర్ - డిపార్ట్మెంటల్ కమిటీ (IDC)కి పంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

భద్రతా ఆందోళనల కారణంగా ఈ సినిమాను తొలగించాలని ZEE5 ఓటీటీని ఆదేశించినట్టు వర్గాలు పేర్కొన్నాయి. IT Rules, 2021 కింద ఏర్పాటు చేసిన IDC, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ పబ్లిషర్లు ప్రచురించే కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయడం ఈ కమిటీ బాధ్యతగా ఉంది. అదే పరిధిలో ‘సత్లుజ్’కు అనుమతి అంశాన్ని కూడా పరిశీలించనుంది.