రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: రైలు ప్రయాణికుల టికెట్ తనిఖీల విధానంలో భారతీయ రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. ఇకపై వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు లేదా స్క్రీన్‌షాట్ రూపంలో చూపించే టికెట్లను చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. ఒరిజినల్ టికెట్లను మాత్రమే టీటీఈలు అంగీకరిస్తారని తెలిపింది.
టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ వివరించింది. రైల్వే టికెట్ వెరిఫికేషన్ సమయంలో వాట్సప్ ద్వారా షేర్ చేసిన టికెట్లు, లేదా స్క్రీన్‌షాట్ రూపంలో ఉన్న టికెట్లను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లు ఇకపై అనుమతించరని స్పష్టం చేసింది. ఇలాంటి టికెట్లను సులభంగా ఎడిట్ చేయడం, ట్యాంపరింగ్ చేయడం సాధ్యమవుతుందని, ఒకే టికెట్‌ను పలువురికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉందని శాఖ సూచించింది.
ఈ నేపథ్యంలో రైల్వే బుకింగ్ ప్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేసిన ఇ-టికెట్లు లేదా చెల్లుబాటు అయ్యే ప్రింటెడ్ టికెట్లను మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారిక ప్లాట్‌ఫాం ద్వారా జారీ కాని, లేదా ఒరిజినల్ రూపంలో లేని టికెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.
ప్రయాణికులు కేవలం వాట్సప్ స్క్రీన్‌షాట్లు లేదా ఫార్వర్డ్ మెసేజ్‌లను మాత్రమే చూపించిన పక్షంలో, వారిని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణిస్తారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత ప్రయాణికులు కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదనంగా జరిమానా విధించడంతో పాటు, రైల్వే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని శాఖ హెచ్చరించింది.
టికెట్ తనిఖీ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన పత్రాల వివరాలను కూడా రైల్వే శాఖ వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ కనెక్ట్ యాప్ ద్వారా బుక్ చేసిన ఇ-టికెట్ మొబైల్‌లో అందుబాటులో ఉండాలి. టికెట్ బుకింగ్ సమయంలో మొబైల్‌కు వచ్చే కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా చూపించగలగాలి. అవసరమైతే ఒరిజినల్ ఇ-టికెట్ ప్రింటెడ్ కాపీని వెంట తీసుకెళ్లాలని సూచించింది.
అదనంగా, టికెట్‌తో పాటు ప్రయాణికులు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను కూడా వెంట తీసుకెళ్లాలని రైల్వే శాఖ సూచించింది. గుర్తింపు పత్రాలు, ఒరిజినల్ టికెట్లు కలిగి ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుందని, టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.




