రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్: హార్ట్‌అటాక్ వచ్చినప్పుడు కొన్ని నిమిషాల ఆలస్యం కూడా ప్రాణాంతకమవుతుందనే విషయం వైద్యరంగం పదేపదే హెచ్చరిస్తోంది. ఈ అత్యవసర పరిస్థితులను ముందుగానే గుర్తించి ప్రాణనష్టం తగ్గించేందుకు షికాగో University శాస్త్రవేత్తలు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. సెకనులోని వందోవంతు సమయంలో గుండె సంబంధిత సమస్యలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే ‘ఏఐ స్కిన్ ప్యాచ్’ను వారు ఆవిష్కరించారు.
ఈ ఏఐ స్కిన్ ప్యాచ్ రూపకల్పన ప్రత్యేకంగా ఉండేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది చూడటానికి మృదువైన పొరలా ఉండి, శరీరంపై సులభంగా అతుక్కుపోతుంది. శరీరానికి అసౌకర్యం కలగకుండా, దీర్ఘకాలం ధరించగలిగేలా దీని నిర్మాణం ఉండేలా చూసారు. గుండె స్పందనలో వచ్చే సూక్ష్మ మార్పులను కూడా ఇది వెంటనే గుర్తించగలగడం దీని ప్రధాన లక్షణం.
ఈ ప్యాచ్‌లో అమర్చిన ‘ఆర్గానిక్ ఎలక్ట్రో కెమికల్ ట్రాన్సిస్టర్స్’ గుండె కొట్టుకునే తీరును నిరంతరం పరిశీలిస్తాయి. గుండె స్పందనలో కనిపించే తేడాలను అత్యంత తక్కువ సమయంలో స్వయంగా విశ్లేషించి, వెంటనే వైద్యులకు సమాచారం చేరవేస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం, గుండెజబ్బులను గుర్తించడంలో ఈ ప్యాచ్ సుమారు 99 శాతం కచ్చితత్వాన్ని సాధించగలదని పేర్కొంటున్నారు.
సాధారణంగా మార్కెట్లో లభించే Smartwatch వంటి పరికరాలు కూడా మన నడక వేగం, గుండె స్పందన వేగం వంటి డేటాను సేకరిస్తాయి. అయితే అవి స్వయంగా విశ్లేషణ చేయలేవు. అందుకోసం వేరే సర్వర్ల సాయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. డేటా పంపడం, తిరిగి విశ్లేషణ ఫలితాలు అందుకోవడం మధ్యలో సమయం పట్టే అవకాశం ఉంటుంది.
కానీ ఈ ఏఐ స్కిన్ ప్యాచ్ మాత్రం శరీరానికి అతుక్కున్న స్థితిలోనే సెకనులోని వందోవంతు సమయంలో విశ్లేషణ పూర్తి చేసి, గుండె సమస్యల గురించి వైద్యులను హెచ్చరిస్తుంది. అదనపు సర్వర్ల అవసరం లేకుండా, ప్యాచ్ లోపలే విశ్లేషణ జరగడం వల్ల స్పందన వేగం మరింత పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వేగం ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషించగలదని నిపుణులు భావిస్తున్నారు.
గుండె స్పందనలో ఒక్కసారిగా తీవ్రమైన మార్పులు వచ్చి ప్రాణాలు కోల్పోయే ‘వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్’ వంటి ప్రాణాంతక సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఈ ప్యాచ్ ఉపయోగకరంగా ఉండగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. గుండె సంబంధిత ప్రమాదాలను ముందుగానే గుర్తించి, తక్షణ చికిత్స అందించే దిశగా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వైద్యరంగానికి మరొక ముఖ్యమైన సాధనంగా మారే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.







