రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్:
చిన్నతనంలో షుగరీ డ్రింక్స్ అధికంగా తాగితే పెద్దయ్యాక హైబీపీ ముప్పు పెరుగుదల
చిన్నతనంలో చక్కెర అధికంగా ఉన్న పానీయాలు, ఫ్రూట్ జ్యూస్‌లను ఎక్కువగా తాగిన వారిలో పెద్దయ్యాక రక్తపోటు ముప్పు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఒక దీర్ఘకాలిక అధ్యయనం సూచించింది. యూఎస్‌లో దాదాపు 25 వేల మందిపై సుమారు పాతికేళ్లపాటు చేసిన పరిశోధన ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన సేర్కులేషన్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.
హైబీపీ ఉన్నవారిలో స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందనేది వైద్యవర్గాలకు తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్నతనంలో తీసుకునే పానీయాల ప్రభావాన్ని పరిశీలించిన పరిశోధకులు, చక్కెర అధికంగా ఉన్న పానీయాల వినియోగం, భవిష్యత్‌లో రక్తపోటు ముప్పు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు.
పరిశోధకుల వివరాల ప్రకారం, చిన్నతనంలో రోజుకు రెండు మూడు గ్లాసులకంటే ఎక్కువగా షుగరీ డ్రింక్స్ తాగే పిల్లల్లో, వారానికి మూడు గ్లాసులు మాత్రమే తాగే వారితో పోలిస్తే హైబీపీ ముప్పు 52 శాతం వరకు అధికంగా ఉన్నట్లు తేలింది. ఒక్కో గ్లాసు పరిమాణాన్ని 333 మిల్లీలీటర్లుగా పరిగణించి ఈ లెక్కలు వేశారు.
ఇందులో కూడా పానీయాల రకానుబట్టి ముప్పు స్థాయిలో తేడా కనిపించింది. సోడా తరహా పానీయాలు ఎక్కువగా తాగిన వారిలో హైబీపీ ముప్పు 23 శాతం పెరిగిందని, స్పోర్ట్స్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో ఈ ముప్పు 36 శాతం వరకు పెరిగిందని పరిశోధకులు గుర్తించారు.
ఫ్రూట్ జ్యూస్‌ల విషయంలో కూడా ఇలాంటి ధోరణి కనిపించింది. చిన్నతనంలో ఫ్రూట్ జ్యూస్‌లను అతిగా తాగిన వారిలో రక్తపోటు ముప్పు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. రోజుకు 1.5 గ్లాసులకు పైగా ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు హైబీపీ రిస్క్ 35 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
చిన్నతనంలో ఏర్పడే ఆహారపు అలవాట్ల ప్రభావం దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే షుగరీ డ్రింక్స్ మాత్రమే నేరుగా హైబీపీకి కారణమని తాము చెప్పడం లేదని, రక్తపోటు పెరగడానికి ఇతర కారకాలు కూడా ఉండవచ్చని స్పష్టం చేశారు.
ఈ అధ్యయనం నేపథ్యంలో పిల్లల ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రులు, పాఠశాలలు మరింత జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నతనంలో చక్కెర అధికంగా ఉన్న పానీయాల వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్‌లో హైబీపీ, గుండె సంబంధిత సమస్యల ముప్పును కొంతవరకు తగ్గించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.







