రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్: నిద్రలేమి చికిత్స అనగానే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేవి నిద్ర మాత్రలు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటి విధానాలే. అయితే ఇటీవలి కాలంలో సంగీతాన్ని చికిత్సా పద్ధతిగా వినియోగించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. దుష్ప్రభావాలు లేకుండా, సహజంగా నిద్రను ప్రోత్సహించే సామర్థ్యం ఉండటం సంగీత చికిత్సను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.
తల్లి జోలపాట వింటూ బుజ్జాయి హాయిగా నిద్రలోకి జారిపోవటం, శ్రావ్యమైన గానంతో మనసు ప్రశాంతంగా మారి కునుకు రావటం వంటి అనుభవాలు సంగీత ప్రభావానికి ఉదాహరణలు. ఈ ప్రభావం వెనక మెదడులోని వేర్వేరు భాగాలపై సంగీతం చూపే ప్రభావం కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నాడీ వ్యవస్థ, శారీరక ప్రతిస్పందనల్లో సంగీతం మార్పులు తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు.
సంగీతం స్వభావం రెండంచుల పదునైన కత్తిలాంటిదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వినే సంగీత రకం, స్వరాల స్థాయి, వేగం వంటి అంశాలపై ఆధారపడి దాని ప్రభావం మారుతుంది. ఉచ్ఛ స్వరాలతో కూడిన సంగీతం అప్రమత్తత, హుషారును పెంచుతుండగా, మంద్ర స్థాయి, పునరావృత స్వరాలు మెదడులో నిద్ర ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనతో ముడిపడిన స్పందనలను తగ్గించి, హాయి భావనను కలిగిస్తాయి.
శ్రావ్యమైన సంగీతం వినటం వల్ల ఒత్తిడిని ప్రేరేపించే సింపథెటిక్ నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. దీంతో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ మోతాదులు తగ్గుతాయి. అలాగే స్వయంచాలిత నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తూ గుండె వేగం, శ్వాస వేగం, రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతుంది. ప్రేమ, హాయి భావనలను పెంచే ఆక్సిటోసిన్ హార్మోన్ మోతాదులు పెరగటం ద్వారా మూడ్ మెరుగవుతుంది, ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ఇవన్నీ కలిపి నిద్ర పట్టటానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.
సంగీతం ప్రభావం నాడీ సమాచార వాహకాలు అయిన డొపమిన్, సెరటోనిన్ స్థాయిలను మాత్రమే కాదు, పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులను కూడా మార్చగలదని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. పేగు బ్యాక్టీరియా నిరంతరం మెదడుతో సమాచార మార్పిడి జరుపుతూ నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తోంది. పేగుల్లో నివసించే మంచి బ్యాక్టీరియా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిద్రతో ముడిపడిన రసాయనాలను విడుదల చేస్తుండటం గమనార్హం.
ఈ సూక్ష్మజీవుల నుంచి పుట్టుకొచ్చే ప్రత్యేక రసాయనాలు వేగస్ నాడీ ద్వారా మెదడులోని నిద్ర కేంద్రాలపై ప్రభావం చూపుతాయి. పేగు బ్యాక్టీరియా, వీటి జీవక్రియలతో ఏర్పడే రసాయనాలు పరోక్షంగా నిద్రను నియంత్రించే రోగనిరోధక ప్రతిస్పందనను శ్రుతి చేస్తాయి. రక్తంలో కలిసి ప్రవహించే ఈ రసాయనాలు నిద్ర–మెలకువలను పర్యవేక్షించే జీవగడియారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
పేగులు, మెదడు మధ్య సమాచార ప్రసారం రెండు వైపుల నుంచి సాగుతుండటం వల్ల ఏదో ఒకటి అస్తవ్యస్తమైతే నిద్ర నాణ్యత దెబ్బతింటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర సమస్యలతో బాధపడేవారిలో పేగు బ్యాక్టీరియా తీరు మారిపోతుండటం, మంచి బ్యాక్టీరియా తగ్గిపోవటం వల్ల నిద్రను నియంత్రించే జీవక్రియ రసాయనాల మోతాదులు పడిపోతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా నిద్ర సరిగా పట్టకపోవటం, గాఢ నిద్ర కొరవడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు నిద్రలేమి కొనసాగితే హానికర బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.
శ్రావ్యమైన, శాస్త్రీయ సంగీతం వినటం వల్ల పేగుల్లో ల్యాక్టోబాసిలస్ అనే మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతున్నట్టు కొన్ని పరిశోధనలు వివరిస్తున్నాయి. ఈ బ్యాక్టీరియా గాబా వంటి నాడీ హార్మోన్లను మేళవిస్తూ నిద్రను ప్రోత్సహించేలా పనిచేస్తున్నాయని సూచనలు ఉన్నాయి. అంటే సరైన సంగీతాన్ని ఎంచుకుని వినటం ద్వారా మూడ్ మెరుగుపడటం, ప్రశాంతత కలగటంతో పాటు మెదడు–పేగులు–నిద్ర మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసి నిద్ర నాణ్యతను పెంచే అవకాశం ఉందన్నమాట.
నిద్రలేమి చికిత్సలో ఇప్పటికే సంగీతాన్ని ఒక ఉపచికిత్సగా వినియోగిస్తున్న వైద్యులు, నిపుణులు దీని వెనక గల శాస్త్రీయ రహస్యాన్ని మరింతగా అర్థం చేసుకుంటే, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సరైన సంగీతాన్ని ఎంచుకుని వినియోగించే మార్గాలు స్పష్టమవుతాయని భావిస్తున్నారు.







