రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం:
మంత్రి సత్యకుమార్
విజయవాడ : రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత రెండేళ్లలో ఆరోగ్య రంగంలో సాధించిన పురోగతి, అమలు చేస్తున్న ప్రణాళికలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్, శుక్రవారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తావించారని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
ఓపీ సేవల నుంచి ప్రత్యేక వైద్య సేవల వరకు అన్ని స్థాయిల్లో సరికొత్త మార్పులు తీసుకొచ్చామని మంత్రి వివరించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరి రికార్డును డిజిటల్ రూపంలో నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో హెల్త్ సెక్టార్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సేవల ద్వారా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, దీనిని ప్రభుత్వం గర్వంగా భావిస్తోందని సత్యకుమార్ తెలిపారు. ఆరోగ్య శాఖలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పనిచేస్తున్న అధికారులందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు రాష్ట్రంలో సంతృప్తికరమైన వాతావరణం నెలకొల్పగలిగామని ఆయన పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. ఈ దిశగా అన్ని విధాలా సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రతిపక్షం లేదని, గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఆరోగ్య శాఖ దెబ్బతిన్నదని ఆయన విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో తాము సమర్థంగా పని చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సవాలుతో కూడిన బాధ్యతలను అప్పగించిన జగన్కు కూడా ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని సత్యకుమార్ చెప్పారు. రియాక్టివ్, క్యూరేటివ్ విధానాల నుంచి ప్రిడెక్టివ్ దిశగా వ్యవస్థను మలుస్తున్నామని వివరించారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, ముందుగానే సమస్యలను గుర్తించి అవసరమైన మందులు అందజేస్తున్నామని తెలిపారు.
టెలిమెడిసిన్ ద్వారా ప్రజల సందేహాలకు నిపుణులైన వైద్యుల ద్వారా సమాధానాలు అందించే వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి చెప్పారు. ఆరోగ్య రంగ అభివృద్ధిలో మీడియా కూడా కీలక పాత్ర పోషించిందని, ఎక్కడ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం అయ్యేలా సహకరించిందని ఆయన అభినందించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, మంచి సేవలు అందుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని సత్యకుమార్ తెలిపారు. ఇవి తాము చెబుతున్న మాటలు కాదని, గణాంకాలే తమ పని తీరును స్పష్టంగా చూపిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.







